కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ కొందరు సిక్కులతో కలిసి కింద కూర్చుని ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. రైతులకు సంఘీభావంగా జస్టిన్ అలా కూర్చున్నాడని చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఈ ఫోటోపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోపై 2015లో Hindustan Times లో ఓ కథనం వచ్చింది. "Canadian Prime Minister Justin Trudeau visited a Hindu temple and a gurdwara in Ottawa to celebrate Diwali with the Indo-Canadian community, which turned out in huge numbers to greet him," అంటూ ఆర్టికల్ లో రాశారు.
కెనెడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ ఒట్టావా లోని గురుద్వారాకు వెళ్లారు. అక్కడి ఇండో-కెనెడియన్ ప్రజలతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జస్టిన్ వస్తున్నారని తెలియగానే పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు గురుద్వారాకు విచ్చేశారు.
Reuters, Adobe Stock లో కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో కూడా జస్టిన్ పాల్గొన్నారని మీడియా సంస్థలు తెలిపాయి. ఒట్టావా ఎంపీ చంద్ర ఆర్య ఆహ్వానించడంతో జస్టిన్ దీపావళి వేడుకలో పాల్గొన్నారు. మీ అందరితో కలిసి దీపావళి జరుపుకుంటూ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. భారత్-కెనడా బంధం మరింత పటిష్టమవ్వాలని ఆయన తెలిపారు.
ఈ ఫోటో 2015కు సంబంధించినది అయినా.. భారత్ లో రైతుల ఉద్యమానికి జస్టిన్ ట్రుడేవ్ మద్దతు చెబుతూనే ఉన్నారు. ఇండియాలో రైతు నిరసనల గురించి వస్తున్న వార్తలు వింటున్నామని.. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనన్న విషయం మనల్ని కలవరపెడుతుంది. మీ అందరి మనసుల్లో చెలరేగుతున్న కల్లోలం గురించి నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్లకు మనం అండగా ఉన్నామన్నారు. గురునానక్ 551వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్ ఈవెంట్‌లో జస్టిన్ ట్రుడేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనదన్నారు. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు.
రైతుల ధర్నాలో కెనెడా ప్రధానమంత్రి కూడా కూర్చున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటో 5 సంవత్సరాల కిందటిది.