కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఉండగా ‘మోదీ.. మోదీ' అంటూ నినాదాలు వినిపించడంతో ఆయన తన స్పీచ్ ను ఆపేశారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
వీడియోలో "చుప్ బైథో, అగర్ సున్నా హై తో సునో, నహీ టు గెట్ అవుట్. తుమ్హరే మూహ్ మైన్…తుమ్కో జో హోనా వో కెహతే. అగర్ సున్నా హై తో సునో, వార్నా అప్నీ జగహ్ కో జావో' (నిశ్శబ్దంగా కూర్చోండి, మీరు వినడానికి ఇష్టపడకపోతే, బయటకు వెళ్లండి. మీ నోటికి ఏది వస్తే అది మీరు చెబుతున్నారు. మీకు వినాలని ఉంటే వినండి, లేకపోతే మీ మార్గంలో వెళ్ళండి)." అంటూ ఖర్గే చెప్పినట్లుగా ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోలోని ఆడియో ఎడిట్ చేశారని.. న్యూస్‌మీటర్ బృందం వైరల్ వీడియోలో ఎలాంటి నిజం లేదని గుర్తించింది.
వైరల్ వీడియో స్క్రీన్‌గ్రాబ్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. నవంబర్ 27న టైమ్స్ నౌ, మోజో స్టోరీ వంటి మీడియా అవుట్‌లెట్‌లకు సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌లలో అప్‌లోడ్ చేసిన అదే క్లిప్ కు సంబంధించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ నివేదికల ప్రకారం, వీడియో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 ప్రచార ర్యాలీకి సంబంధించినదని గుర్తించాం. ఆ వీడియోను నిశితంగా పరిశీలించిన న్యూస్ మీటర్ బృందం ఆయన మాట్లాడుతున్న సమయంలో మోదీ-మోదీ అంటూ ఎలాంటి నినాదాలు చేయలేదని మేము గుర్తించాం.
ఖర్గే సభకు వచ్చిన వాళ్లపై విరుచుకుపడిన సంఘటనను ఇతర మీడియా సంస్థలు నివేదించాయి. న్యూస్ 18 కథనం ప్రకారం, నవంబర్ 26 న తెలంగాణలోని కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తల ప్రవర్తనపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను వివరిస్తూ ఉండగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. అందుకే కోపంలో ఖర్గే అక్కడున్నవాళ్లను తిట్టారు. తెలంగాణలో ఖర్గే తన పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు.
ఆడియో ఎక్కడిదంటే :
సెప్టెంబర్ 7 నాటి ఇండియా టుడే నివేదిక ప్రకారం.. వైరల్ వీడియోలో ఉపయోగించిన "మోదీ-ఛాంటింగ్" కు సంబంధించిన అసలైన ఆడియోను కూడా మేము గుర్తించాము. వీడియో నివేదిక ప్రకారం, అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను "మోదీ, మోదీ" అనే నినాదాలతో స్వాగతించారు. మునిసిపల్ కౌన్సిల్‌లో ఒక కార్యక్రమానికి హాజరైన తర్వాత యువకులతో సంభాషించడానికి తన కాన్వాయ్‌ని ఆపినప్పుడు గెహ్లాట్ ను ఇలా ప్రజలు సంప్రదించారు. గెహ్లాట్ ప్రజలను పలకరించి, తిరిగి తన కారులోకి ఎక్కి అక్కడి నుండి నిష్క్రమించారు. ఆయన వెళ్లిపోయాక ‘జై శ్రీరామ్’ నినాదాలు కూడా మిన్నంటాయి.
కాబట్టి.. ఖర్గే కు సంబంధించిన వైరల్ వీడియో ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. వీడియోలో వినిపించిన ఆడియో వేరే ఈవెంట్ నుండి తీసుకున్నారు.
Credits : Sunanda Naik