FactCheck : రైతు చట్టాలను రద్దు చేసినందుకు ఆగ్రహంతో రోడ్డుపై టమాటాలను రైతులు పారబోస్తూ ఉన్నారా..?

Video Showing Farmers Dumping Tomatoes on roadside not liked to repeal of FarmLaws. రైతు చట్టాలను గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Dec 2021 5:34 PM IST
FactCheck : రైతు చట్టాలను రద్దు చేసినందుకు ఆగ్రహంతో రోడ్డుపై టమాటాలను రైతులు పారబోస్తూ ఉన్నారా..?

రైతు చట్టాలను గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఇటీవలే రైతు చట్టాల రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గతేడాది కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాలను తీసుకురాగా దీనిని దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కార్పొరేట్లకు ఊతమిచ్చేలా ఉన్నాయని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. మరోవైపు రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఉద్యమం చేశారు రైతులు. రైతు ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం ఇటీవలే రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది.

అయితే.. కర్నాటకలో రైతులు టమోటాలను రోడ్డుపై పారబోస్తున్నట్లు చూపుతున్న ఆసియానెట్ మలయాళం యొక్క న్యూస్ బులెటిన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఈ సంఘటన జరిగిందని పేర్కొంది. డిసెంబరు 1న వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాత రైతులు వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలుగుతారని చెబుతున్నారు.

"దక్షిణ భారతదేశంలో, దళారులు రైతులకు సరైన ధర ఇవ్వడం లేదు, వారు కిలోకు 75 పైసలు ఇస్తున్నారు. అందుకే రైతులు టమోటాలను రోడ్ల పక్కన పారవేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో టమాటా కొరత ఉంది. దుష్ప్రచారాల వల్ల మోదీజీ వ్యవసాయ చట్టాల ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది." అంటూ పోస్టులు పెడుతున్నారు.

నిజ నిర్ధారణ :

రైతులు టమాటాలను పారబోస్తున్న వీడియోలకు, వ్యవసాయ చట్టాల రద్దుకు ఎటువంటి సంబంధం లేదు.

ఏషియానెట్ మలయాళం న్యూస్ పోస్ట్ చేసిన వీడియో మే 15 నాటిది. వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు వీడియోకు ఎటువంటి సంబంధం లేదని తేదీ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అదే విజువల్స్‌తో కూడిన అమర్ ఉజాలా, వన్ ఇండియా న్యూస్ మరియు TV 10 న్యూస్ ద్వారా వచ్చిన వీడియో నివేదికలు మే 2021లో అప్‌లోడ్ చేయబడ్డాయి.


మే 2021లో కర్నాటకలో రైతులు ఎదుర్కొన్న బాధలను ఈ వీడియో ద్వారా తెలియజేసారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలలో కిలో ధర భారీగా పడిపోయింది. కిలో 2-3 రూపాయలకు అమ్మాలని APMC మార్కెట్ లో కోరడంతో కోలార్‌లోని పలు ప్రాంతాల్లో టమోటా రైతులు రోడ్డు పక్కన టమాటాలను పడేశారు. మార్కెట్‌లో తీసుకురావడానికి కూడా రైతులకు ఖర్చుతో కూడుకున్నది. ధరల పతనం కారణంగా కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా భరించలేక పోతున్నామని.. పెద్ద మొత్తంలో టమోటాలు పండించామని మంచి ధరను ఆశిస్తే చాలా తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోయారు. దీంతో కోపంతో టమోటాలను రోడ్డు పక్కన పడవేయడం జరిగింది.

స్పష్టంగా, ఈ ఘటనకు వ్యవసాయ చట్టాల రద్దుకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:రైతు చట్టాలను రద్దు చేసినందుకు ఆగ్రహంతో రోడ్డుపై టమాటాలను రైతులు పారబోస్తూ ఉన్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story