రైల్వే స్టేషన్‌లోని హై-వోల్టేజీ ఎలక్ట్రిక్ కేబుల్ నుండి ఇయర్‌ఫోన్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగిందని.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌పై పడిపోతున్న వీడియో షేర్ చేస్తున్నారు.
NewsMeter బృందానికి ఈ వీడియో WhatsApp ద్వారా వచ్చింది. నిజమో కాదో తెలుసుకోడానికి వీడియోను స్వీకరించింది.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఓ వ్యక్తి హై-టెన్షన్ ఓవర్‌హెడ్ రైల్వే కేబుల్‌కు దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ఇయర్‌ఫోన్‌ల ద్వారా భారీ షాక్‌కు గురయ్యాడు..."అని వ్రాశాడు.
నిజ నిర్ధారణ :
NewsMeter వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. జర్నలిస్ట్ పూజా మెహతా చేసిన ట్వీట్‌ను కనుగొన్నాం. ఆమె ఈ వీడియోను డిసెంబర్ 8న పోస్ట్ చేసింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) తలపై కేబుల్ వైర్ పడింది. దీంతో టీటీఈకి కాలిన గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని ఆమె పేర్కొన్నారు.
దీనిని క్లూగా తీసుకొని, మేము కీవర్డ్ శోధనను నిర్వహించాము. ఇండియా టుడే ఈ సంఘటనను డిసెంబర్ 8న నివేదించినట్లు కనుగొన్నాము. ఈ నివేదికలో ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ఉన్న రైల్వే అధికారి సుజన్ సింగ్ సర్దార్ తలపై హై-వోల్టేజ్ వైర్ తెగిపోవడంతో కాలిన గాయాలకు గురయ్యాడు.
ఖరగ్‌పూర్ డీఆర్‌ఎం మహ్మద్ సుజాత్ హష్మీ ఇండియా టుడేతో మాట్లాడుతూ పక్షులు తరచూ చిన్న చిన్న తీగలకు అడ్డం రావడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు.
హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా సంస్థలలో.. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో లైవ్ వైర్ పడిపోవడంతో ఒక TTE గాయపడినట్లు నివేదించింది.
మేము డిసెంబర్ 7న జీ 24 ఘంటా వీడియో నివేదికను కూడా కనుగొన్నాము. డీఆర్‌ఎం మహ్మద్ షుజాత్ హష్మీ మీడియాతో మాట్లాడుతూ.. సుజన్‌సింగ్ ప్రమాదం నుంచి బయటపడ్డారని, వైర్ అతనిపై పడడంతో ఈ ప్రమాదం జరిగిందని ధృవీకరించారు.
వైర్ అతనిపై పడటంతో రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి కుప్పకూలినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. ఇయర్ ఫోన్స్ నుండి కరెంట్ షాక్ వల్ల అతను కుప్పకూలిపోయాడనే వాదన తప్పుదారి పట్టించేది.