దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులు రైళ్లపై రాళ్లు రువ్వుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌లోని పరిస్థితిని చూపుతుందనే వాదనతో వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియోలో రైల్వే స్టేషన్ పేరు 'సికింద్రాబాద్' అని ఉండడం స్పష్టంగా చూడవచ్చు. స్టేషన్ పేరు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో వ్రాయబడింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చెందినదని స్పష్టంగా తెలుస్తోంది.
జూన్ 17 న, కేంద్రం తీసుకుని వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిరసనలు చెలరేగాయి. ఇది విధ్వంసానికి దారితీసింది, అధికారులు రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ఈ నిరసనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
వార్తా నివేదికల ప్రకారం.. సాయుధ దళాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై నిరసనకారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ) కోసం మూడేళ్లుగా ఎదురుచూసిన వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. హింసాత్మక నిరసనలో దాదాపు 1,500 మంది పాల్గొన్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యక్తులు బ్యానర్లు, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. తర్వాత ప్లాట్‌ఫారమ్‌పైకి, ట్రాక్‌లపైకి పలు వస్తువులను విసిరారు. బోగీలను తగులబెట్టారు కూడా..!
ఈ వీడియో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చెందినది. ఉత్తరప్రదేశ్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం అయింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.