లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది.
జాతీయవాదానికి, దేశద్రోహానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి పాఠశాలకు వెళ్లాలని సూచించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడే ముందు రాహుల్ గాంధీని సిద్ధూ టార్గెట్ చేశారంటూ ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.
చాలా మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఇదే వాదనలు చేస్తూ వీడియోను వైరల్ అయ్యేలా చేశారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో 2010లో సిద్ధూ బీజేపీ ఎంపీగా ఉన్న నాటిదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ వీడియోలో ఇండియా టీవీ లోగోను చూడొచ్చు. దీనిని క్లూగా ఉపయోగించి.. మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అక్టోబర్ 8, 2010న ఇండియా TV YouTube ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. వీడియోను “RSS Remark: Sidhu Asks Rahul To Go To School.” అనే టైటిల్ తో అప్లోడ్ చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ని నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాతో పోల్చిన రాహుల్ గాంధీపై సిద్ధూ విమర్శలు గుప్పించారు. జాతీయవాదం, దేశద్రోహం మధ్య తేడాను తెలుసుకోడానికి రాహుల్ గాంధీని పాఠశాలకు వెళ్లమని ఆ సమయంలో బీజేపీ ఎంపిగా ఉన్న సిద్ధూ కోరినట్లు ఛానెల్ పేర్కొంది. గుజరాత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2010లో సిద్ధూ రాహుల్ గాంధీని చిన్నపిల్లవాడితో పోల్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా పాఠశాలకు వెళ్లమని సూచించాడు. RSS ఒక మతోన్మాద సమూహం అని దానిని సిమితో రాహుల్ గాంధీ పోల్చడంపై దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీపై విమర్శలు వచ్చాయి.
ఇక పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యాప్తికి అప్పటి అకాలీ-బీజేపీ ప్రభుత్వాన్ని నిందిస్తూ 2017లో సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, సిద్ధూ, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. తనను తాను బై బర్త్ కాంగ్రెస్‌వాదిగా చెప్పుకొచ్చారు.
కాబట్టి, రాహుల్ గాంధీని నవజ్యోత్ సింగ్ సిద్ధూ విమర్శిస్తున్న వీడియో 2010 నాటిదని మేము నిర్ధారించాము. వీడియో ఇటీవలిదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేము గుర్తించాం.
Credits : Md Mahfooz Alam