ఓ హిందూ ఆలయాన్ని కొందరు వ్యక్తులు కలిసి ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుందని పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇతర మతస్థులకు స్థానం లేదని చెబుతూ.. కొందరు ఇలా హిందూ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారని పోస్టులు పెట్టారు. పలువురు ఈ పోస్టులను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
షేర్ చేయబడుతున్న పోస్టులలో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టులను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. యూట్యూబ్ లో ఇవే విజువల్స్ లభించాయి. ఆగష్టు 5, 2021న CNN-News 18 మీడియా సంస్థ ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ను షేర్ చేసింది. ఈ ఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో చోటు చేసుకుందని మీడియా సంస్థలు తెలిపాయి. One India, CRUX మీడియా సంస్థలు కూడా ఈ ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుందని స్పష్టం చేశాయి.
Oneindia News ఇచ్చిన వివరణలో "సోషల్ మీడియాలో షేర్ చేయబడిన షాకింగ్ వీడియోలో, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్న పాకిస్తాన్ యువకుల సమూహాన్ని చూడవచ్చు. ఒక ముస్లిం గుంపు దేవాలయం యొక్క కొన్ని భాగాలను తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేసింది. రహీమ్ యార్ ఖాన్ జిల్లా, లాహోర్ నుండి దాదాపు 590 కి.మీ. దూరంలో ఉంది.. ఇక్కడే ఈ ఘటన చోటు చేసుకుంది" అని తెలిపారు.
Al Jazeera, The Times of India, The Hindu మొదలైన మీడియా సంస్థలు కూడా ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందించాయి. నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లోని భోంగ్ నగరంలోని సిద్ధివినాయక్ ఆలయంపై కొందరు దాడి చేశారు. "ఈ సంఘటన ఆగష్టు 4, 2021 న జరిగింది. దైవదూషణ కేసులో నిందితుడైన 8 ఏళ్ల హిందూ బాలుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసినందుకు ముస్లిం సమూహం కోపంగా ఉంది" అని అల్ జజీరా నివేదించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా "హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేయడంతో నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని.. ఈ సంఘటనకు పాల్పడిన వారికి శిక్షలను విధించాలని అప్పీల్ పంపబడింది." అని కథనాలను నివేదించింది.
కాబట్టి ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకోలేదు. పాకిస్తాన్ లో చోటు చేసుకున్న ఈ ఘటనను ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది అంటూ ప్రచారం చేస్తున్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.