పెట్రోల్ బంకు సిబ్బందిని చితక్కొట్టిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతూ ఉన్నాయని.. ప్రజలకు కోపం వచ్చి ఇలా పెట్రోల్ బంకుల మీదకు దాడి చేశారనే పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, "రావణుడి పాలనలో, కోపంతో ఉన్న ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఈ పని చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము" అని ట్వీట్ చేశారు.
ఫేస్ బుక్ లో కూడా ఇదే వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ ఈ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదని తెలిసింది. ఒడిశాకు చెందిన మీడియా సంస్థలు ఈ వీడియోను పోస్టు చేశాయి. సెప్టెంబర్ 2018లో ఈ వీడియోను యుట్యూబ్ లో అప్లోడ్ చేశారు. "Ruckus In Petrol Pump In Puri Over Cheap Quality of Petrol". తక్కువ క్వాలిటీతో ఉన్న పెట్రోల్ ను అమ్ముతూ ఉన్నారని.. పెట్రోల్-డీజిల్ లను కల్తీ చేస్తున్నారని, తక్కువ పెట్రోల్ ను కొడుతున్నారనే కోపంతో పెట్రోల్ బంకు మీద స్థానికులు దాడి చేశారు.
ఒడిశా రాష్ట్రం లోని పూరిలో ఉన్న పెట్రోల్ పంపుపై స్థానికులు ఇలా దాడి చేశారు.
ఒడిశా టీవీ ప్రకారం, మెడికల్ చాక్ (పూరి) సమీపంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ లో ఇంధనం దొంగిలించారని స్థానికులు ఆరోపిస్తూ దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒక కస్టమర్ ఒక కూజాలో ఒక లీటరు పెట్రోల్ కోసం పెట్రోల్ పంప్ సిబ్బందిలో ఒకరిని కోరాడు. అయితే, పెట్రోల్ కేవలం 650 మి.లీ మాత్రమే కొలుస్తోంది. ఇది సిబ్బందికి, వినియోగదారునికి మధ్య గొడవకు దారితీసింది. అక్కడికక్కడే ఉన్న కొంతమంది స్థానికులు కూడా గొడవలో దూరి పెట్రోల్ పంప్ ను ధ్వంసం చేశారు.
Daily Hunt, Odisha Bytes మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రసారం చేశాయి. కస్టమర్లు డబ్బులు ఇస్తున్నా పెట్రోల్ బంకు సిబ్బంది మాత్రం వారిని మోసం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో స్థానికులు పెట్రోల్ బంకును ధ్వంసం చేశారు.
ఇది 2018లో చోటు చేసుకున్న ఘటన.. అంతేకానీ ఇప్పుడు పెట్రోల్-డీజిల్ ధరలు పెరగడం వలన ప్రజలు ఇలా విధ్వంసం సృష్టించలేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.