కొందరు వ్యక్తులు పూజ చేస్తుండగా.. పోలీసులు వచ్చి వాళ్ళను పక్కకు తోసేసి వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుందని పలువురు పోస్టులు చేయడం మొదలుపెట్టారు. కేరళ ప్రభుత్వం వినాయకచవితికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా పోస్టులు పెట్టారు.
गणेशोत्सव में केरल में ये हालात हो गए है हिन्दुओ के हिन्दू अपना त्योहार भी नही मना सकता है अपने हिन्दुस्थान में అంటూ కేరళలో హిందూ పండుగలు చేసుకోడానికి వీలు లేదని తెలుపుతూ వీడియోను వైరల్ చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ ఘటన కేరళలో చోటు చేసుకోలేదు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
న్యూస్ మీటర్ వీడియోను ప్లే చేసింది. పోలీసులు తెలుగు భాషలో మాట్లాడుతున్నట్లు గుర్తించాము. మేము ఫేస్‌బుక్‌లో కీలకపదాలతో వెతకగా క్రాంతి ముదిరాజ్ సెప్టెంబర్ 11, 2021 న అప్‌లోడ్ చేసిన వైరల్ వీడియో యొక్క వీడియోను కనుగొన్నాము.
"నిన్న హై టెన్షన్ పోలీస్ అధికారులు హుప్పుగూడ వద్ద గణేష్ మహరాజ్ విగ్రహాన్ని సొసైటీ ప్రాపర్టీ నుండి తొలగించారు" అని క్యాప్షన్ ఉంది. "Yesterday High Tension Police officials Remove Ganesh Maharaj Idol @Rakshapuram Society Property at Huppuguda Old City Hyderabad Telangana State (sic)," అంటూ పోస్టులు పెట్టారు.
మరికొన్ని పోస్టుల ద్వారా ఇది రక్షాపురం సొసైటీలో జరిగిందని నిర్ధారించాము.
కంచన్ భాగ్ పోలీసులతో న్యూస్ మీటర్ మాట్లాడింది. ప్రైవేట్ స్థలంలో కొందరు వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేశారని పోలీసులు తెలిపారు. భూ యజమాని ముందస్తు అనుమతి లేకుండా కొందరు గణేష్ పూజ చేయడానికి ప్రయత్నించారు. భూ యజమాని మాట వినకపోవడంతో పోలీసులు వారిని ఆపాల్సి వచ్చింది. రిపోర్టర్ సుభాన్ ద్వారా ఫేస్‌బుక్‌లో వీడియోను కనుగొన్నాము. అక్కడ కొంతమంది రాజకీయ కార్యకర్తలు ఒక సొసైటీకి చెందిన భూమిపై గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నించారని మరియు వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
కాబట్టి ఇది కేరళలో చోటు చేసుకున్న ఘటన కాదు. తెలంగాణలో చోటు చేసుకున్నదే..!