బట్టలు లేకుండా ఉన్న యువకులపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని గంగా నదిలో స్నానాలు చేస్తున్న యువకులు అట్టడుగు కులానికి చెందిన వారు కావడంతో వారిపై దాడి జరిగిందని వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు ఆరోపించారు
Xలో వీడియోను షేర్ చేసిన ఒక వినియోగ దారులు “మీరు మీ ఆలయాన్ని వదిలి వేరొకరి ఆలయానికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని నగ్నంగా చేసి కొడతారు. ఉత్తరప్రదేశ్ లోని చమర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు గంగాస్నానానికి వెళ్లి కాశీలోని మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన వారు వారి బట్టలు తీయించి మరీ కొట్టారు." అనే వాదనతో పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని, న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.
ఈ వీడియో మధ్యప్రదేశ్‌కు చెందినది, ఉత్తరప్రదేశ్ కు సంబంధించింది కాదు. అంతేకాకుండా ఈ సంఘటనలో కులాల కోణం లేదు.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా సెప్టెంబర్ 12, 2024న స్థానిక YouTube ఛానెల్‌లు (లింక్‌లు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ప్రచురించిన అనేక వీడియో నివేదికలను మేము కనుగొన్నాము. ఈ ఛానెల్‌ల ప్రకారం ఈ వీడియోలో నర్మదా నదిలో యువకులు నగ్నంగా స్నానం చేస్తున్నట్లు చూసారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వర్ లో ఉన్న అహల్య ఘాట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వారిని స్థానికులు నదిలో నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు.
సెప్టెంబర్ 13, 2024 న దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న అహల్య ఘాట్ వద్ద యువకుల గుంపు నగ్నంగా స్నానం చేస్తున్నారు. ఘాట్ ముందు నుండి వెళ్లిన కొందరు స్థానికులు ఇలాంటి ప్రవర్తన సరికాదని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే స్నానం చేస్తున్న యువకులు గొడవకు దిగడంతో స్థానికులు నీటిలో నుంచి బయటకు లాగి మరీ కొట్టారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చేలోపే యువకులు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటన సమయంలో ఘాట్ వద్ద జనం పెద్ద ఎత్తున గుమిగూడారు.
ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌కి చెందినది కాదు. కులాలకు సంబంధించింది కూడా కాదని మేము నిర్ధారించాము. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదిలో నగ్నంగా స్నానం చేసినందుకు కొంతమంది యువకులను స్థానికులు కొట్టిన వీడియో ఇది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam