ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (AIMIM)కి 22.3 లక్షల ఓట్లు వచ్చాయని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. 500 కంటే తక్కువ ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ 82 అసెంబ్లీ స్థానాలను, 1000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 81 అసెంబ్లీ స్థానాలను కోల్పోయిందని వినియోగదారులు తెలిపారు.
"ఉత్తరప్రదేశ్ లో 82 అసెంబ్లీ స్థానాల్లో 500 (ఐదు వందల) ఓట్లతో లోపు, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో ఓడిపోయన సమాజ్ వాది పార్టీ !! 100 నియోజకవర్గాల్లో పోటీ 22.3 లక్షల ఓట్లు అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 వేల ఓట్లు చీల్చిన ఒవైసీ.. బీజేపీకి 100 సీట్లు వచ్చేలా బాటలు వేశారని. ఎలెక్షన్స్ ముందు బూర్ఖ గొడవ చేశారు. ఎవరు చేపించారో ఇప్పటికైనా మీకు తెలిసిందా. ఇవ్వన్నీ బీజేపీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. రాబోయే రోజుల్లో ముస్లిమ్స్, బీజేపీ ఎలక్షన్స్ ట్రాప్ లో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింలు ఆలోచించాలి" అంటూ పోస్టు వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఉత్తరప్రదేశ్‌లో 41.3% ఓట్లతో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, 32.1% ఓట్లతో సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 22 లక్షల ఓట్లు రాలేదు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు 4,50,929 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. అంటే మొత్తం పోలైన ఓట్లలో 0.49%.
https://results.eci.gov.in/ResultAcGenMar2022/partywiseresult-S24.htm?st=S24
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం వెయ్యి ఓట్ల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థుల సంఖ్య కేవలం 15 మాత్రమే.
సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో కేవలం 7 స్థానాల్లో మాత్రమే వెయ్యి ఓట్ల లోపు తేడాతో ఓడిపోయారు. సమాజ్ వాదీ పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థులు రెండు స్థానాల్లో వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోగా, మిగిలిన ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వెయ్యి లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
https://results.eci.gov.in/ResultAcGenMar2022/statewiseS241.htm?st=S241
"2017లో, AIMIM ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 403 స్థానాల్లో 38 స్థానాల్లో పోటీ చేసి దాదాపు 2 లక్షల ఓట్లను సాధించింది. అప్పుడు కేవలం 0.2 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఈసారి 97 స్థానాల్లో బరిలోకి దిగినా.. ఒక్కటి కూడా గెలవలేదు. పార్టీ ఓట్ల శాతం, పోటీ చేసిన సీట్ల సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఓట్ షేర్ 0.46 శాతానికి పెరిగింది" అని ది ప్రింట్ నివేదించింది.
కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఎంఐఎం పార్టీకి యూపీ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రాలేదు. కేవలం 4,50,929 ఓట్లు మాత్రమే వచ్చాయి.