FactCheck : తమిళనటుడు విజయ్ పార్టీ ఆఫీసును కూల్చివేశారా?
తమిళ నటుడు విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు
తమిళ నటుడు విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇంతలో విజయ్ పెయింటింగ్ ఉన్న గోడను కూల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోడపై ఉన్న రంగులు ఆయన ఇటీవల స్థాపించిన పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) రంగులతో కూడా సరిపోలుతున్నాయి. అయితే విజయ్ ఇఫ్తార్ పార్టీకి హాజరైన తర్వాత ఈ సంఘటన జరిగిందనే వాదనలతో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
విజయ్ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న తర్వాత ఈ వివాదం చెలరేగింది. ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లిం సమాజం మతపరమైన మనోభావాలను విజయ్ అవమానించారనే ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదు చేశారు.
దళపతి విజయ్‌ను అన్నన్ అని పేర్కొంటూ, ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు/ “అన్నన్ ప్రార్థన చేయడానికి ఎక్కడికో వెళ్లాడని నాకు గుర్తుంది...” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని కనుగొంది.
విజయ్ చిత్రం ఉన్న గోడ కూల్చివేత వీడియోకు, ఇఫ్తార్ పార్టీకి సంబంధం లేదు.
వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోను ఫిబ్రవరి 19, 2025న ‘thalapathy_tvk_0622’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసిందని తేలింది.
అదేవిధంగా, మరొక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘enddrum_thalapathy_vijay_fans’ ఫిబ్రవరి 20, 2025న అదే వీడియోను షేర్ చేసింది.
భారతదేశంలో, రంజాన్ ఉపవాసం మార్చి 1–2, 2025న ప్రారంభమైంది. విజయ్ మార్చి 7న ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ వీడియో ఇఫ్తార్ కార్యక్రమానికి ముందే ఉందని స్పష్టంగా తెలుస్తోంది.
కుముదం న్యూస్ 24x7 ఫిబ్రవరి 18, 2025న తమ యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ వీడియోలోని అదే దృశ్యాలను షేర్ చేసింది. ఈ యూట్యూబ్ వీడియోను “TVK Office Demolition: Demolition of Thaveka District Office | TVK Vijay | Tiruvallur | Pathiyal Pettai” అనే క్యాప్షన్ తో అప్లోడ్ చేశారు.
కుముదం న్యూస్ ప్రకారం, తిరువల్లూరులోని ఒక రోడ్డును ఆక్రమించి నిర్మించిన టీవీకే కార్యాలయాన్ని కూల్చివేయడానికి సంబంధించింది. న్యూస్ తమిళ్ 24X7 యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా అదే రోజు ఈ సంఘటన గురించి నివేదించింది.
వైరల్ వీడియో తిరువల్లూరులోని జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మించిన టీవీకే యువజన కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని చూపించింది. కూల్చివేత ఫిబ్రవరి 18, 2025న జరిగింది. కాబట్టి, ఈ వీడియోకు దళపతి విజయ్ ఇఫ్తార్ విందుకు ఎలాంటి సంబంధం లేదు.
వైరల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదని న్యూస్ మీటర్ కనుగొంది. ఫిబ్రవరి 18, 2025న టీవీకే యువజన కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని వీడియో చూపించింది. దీనికి మార్చి 7న విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
Credits : K Sherly Sharon