గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన తర్వాత, గుజరాత్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) మోసం, ఎన్నికల రిగ్గింగ్ జరిగిందంటూ బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు చేశారనే వాదనతో ఒక వీడియో షేర్ చేస్తున్నారు.
ఒక ఫేస్‌బుక్ వినియోగదారు ఈ వీడియోను షేర్ చేస్తూ, "గుజరాత్‌లో ఓట్ల రిగ్గింగ్‌ను బీజేపీకి చెందిన వాళ్లే స్వయంగా బయటపెట్టారు.. ఈవీఎం మోసంలో మోదీ చిక్కుకున్నారు" అని రాశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఒక కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించింది. సుబ్రమణియన్ స్వామి గతంలో ఎన్నికలలో EVM లను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇవ్వని కనుగొన్నారు. 2012లో ది ఎకనామిక్ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం, ఎన్నికల్లో ఈవీఎంలను తారుమారు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని స్వామి చెప్పారు. "ఈవీఎంలలో ఉపయోగించే మైక్రో కంట్రోలర్లు జపాన్ నుండి దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ, అక్కడ ఈవీఎంలు ఉపయోగించరు.. ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తారు" అని ఆయన చెప్పినట్లు కూడా అందులో ఉంది.
దీనిని ఒక క్లూగా తీసుకొని, మేము YouTubeలో కీవర్డ్ సెర్చ్ చేసాము. 19 ఏప్రిల్ 2012న "డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) లో లోపాలను బహిర్గతం చేసారు"("Dr Subramanian Swamy exposes fault in Electronic Voting Machine (EVM).") అనే శీర్షికతో ప్రచురించబడిన వీడియోను కనుగొన్నాము.
ఈ వీడియోలో సుబ్రమణ్యస్వామి వైరల్ క్లిప్ దాదాపు 0.33 నిమిషాల మార్క్‌లో కనిపిస్తుంది. ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్‌లను జపాన్ తయారు చేస్తుందని, అయితే ఆ దేశమే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలను నిర్వహిస్తోందని ఆయన చెపుతున్నారు. సరైన అభ్యర్థికి ఓటు వేసినట్లు నిర్ధారిస్తూ ముద్రించిన రసీదులను ఓటర్లకు అందించాలని తాను హైకోర్టుకు చేసిన సూచన గురించి కూడా ఆయన చెప్పారు.
13 నవంబర్ 2022న సుబ్రమణ్యస్వామి రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం EVMలలో VVPAT (ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగంపై ఎన్నికల సంఘం చేసిన మార్పులను ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. మార్పుల పరిశీలన కోసం తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని కూడా ఆయన చెప్పారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో సుబ్రమణ్యస్వామి EVM మోసాన్ని బహిర్గతం చేయడం గురించి మాకు ఎటువంటి నివేదికలు కనుగొనబడలేదు.
ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించిన సుబ్రమణ్యస్వామి వైరల్ క్లిప్ 10 సంవత్సరాల నాటిదని.. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదని తేలింది. గుజరాత్‌లో బీజేపీ ఈవీఎం మోసాన్ని స్వామి బయటపెట్టారనే వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదని మేము నిర్ధారించాము.