FactCheck : 2025 దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం వెనుక పంట వ్యర్థాలను కాల్చడమే కారణమా?

బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కొత్త పిటిషన్‌కు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి అనుమతించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 24 Oct 2025 4:44 PM IST

FactCheck : 2025 దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం వెనుక పంట వ్యర్థాలను కాల్చడమే కారణమా?

బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన కొత్త పిటిషన్‌కు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్లను కాల్చడానికి అనుమతించింది. దాదాపు ఏడు సంవత్సరాల బ్లాంకెట్ ఫైర్‌క్రాకర్ నిషేధాన్ని రద్దు చేసింది. లక్షలాది మంది దీపావళిని బాణసంచాతో జరుపుకున్న ఒక రోజు తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన స్థాయికి పడిపోయింది.

దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ముఖ్యమైన కారణం అయిన గడ్డి, పంట వ్యర్థాలు, చెత్త దహనంలో 77.5 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, అక్టోబర్ 21న గాలి నాణ్యత సూచిక (AQI) దాదాపు 350 వద్ద ఉంది. PM 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 488 మైక్రోగ్రాముల షాకింగ్ సగటుకు చేరుకున్నాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఎక్స్‌పోజర్ పరిమితికి దాదాపు 100 రెట్లు ఎక్కువ.

ఇలాంటి పరిస్థితుల్లో, పంటను దహనం చేస్తున్న వీడియో షేర్ చేస్తున్నారు. అది ఇటీవలిది, దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యానికి కారణం అనే వాదనతో షేర్ చేస్తున్నారు.

వీడియోను షేర్ చేస్తూ ఒక X యూజర్ "పంజాబ్‌లో జరుగుతున్న పంట వ్యర్థాల దహనం ఈ స్థాయిలో ఉంది. ఢిల్లీ, దాని శివారు ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి ఇది ముఖ్యమైన కారణం" అంటూ పలువురు పోస్టులు పెట్టారు.

పంట కోసిన తర్వాత మిగిలి ఉన్న గడ్డికి నిప్పు పెట్టి త్వరగా, చౌకగా పొలాలను శుభ్రం చేసుకోవచ్చనే ప్రయత్నాలు చేసినప్పుడు భారీగా కాలుష్యం వెలువడుతూ ఉంది.


నిజ నిర్ధారణ:

వైరల్ వీడియో 2024 నాటిది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 1, 2024న ANI ప్రచురించిన అదే ఫుటేజ్ మాకు కనిపించింది.

“పంజాబ్: మోగా జిల్లాలోని దగ్రు గ్రామంలోని ఒక పొలంలో గడ్డిని తగలబెట్టిన సంఘటన కనిపించింది” అని శీర్షిక తో వీడియోను పోస్టు చేశారు.

ఢిల్లీ కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం దోహదపడుతుందా?

చారిత్రాత్మకంగా పంట వ్యర్థాలు, గడ్డి దహనం ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణమైనప్పటికీ, ఇటీవలి డేటా మరింత సంక్లిష్టమైన సమాచారాన్ని అందిస్తూ ఉంది.

అక్టోబర్ 22 నాటి మింట్ నివేదిక ప్రకారం, పంజాబ్, హర్యానాలో భారీ వరదల కారణంగా ఈ అక్టోబర్‌లో పంట వ్యర్థాల దహనం సంఘటనలు 77 శాతం తగ్గాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 15- అక్టోబర్ 21 మధ్య పంజాబ్‌లో కేవలం 415 వ్యవసాయపరమైన అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 1,510 సంఘటనలు నమోదయ్యాయని ఇండియా టుడే నివేదించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా విశ్లేషణ ప్రకారం, ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (AQI) అక్టోబర్ 21 మంగళవారం ఉదయం ఐదు సంవత్సరాలలో అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయింది.

దీపావళి తర్వాత PM 2.5 స్థాయిలు సగటున 488 µg/m³ - దీపావళికి ముందు స్థాయిల కంటే 212 శాతం పెరుగుదల కనిపించిందని, పర్యావరణ, వాతావరణ మార్పు సమస్యలపై దృష్టి సారించిన పరిశోధనా సంస్థ క్లైమేట్ ట్రెండ్స్ వెల్లడించింది.

ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభానికి పంట పొలాలను తగలబెట్టడం దోహదపడుతుండగా, ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం ప్రభావం చూపిందని, పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాల దహనం గణనీయంగా తగ్గాయని డేటా సూచిస్తుంది.

కాబట్టి, వైరల్ వీడియో 2024 నాటిదని, ఇది ఇటీవలిదని, దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యానికి కారణమైందని తప్పుగా షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:2025 దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి కాలుష్యం వెనుక పంట వ్యర్థాలను కాల్చడమే కారణమా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story