Fact Check : 10వ వార్షికోత్సవంలో భాగంగా షాప్ క్లూస్ సంస్థ స్విఫ్ట్ డిజైర్ కార్ ను బహుమతిగా ఇస్తోందా..?
Shopclues is not giving away SWIFT DZIRE car as part of its 10th-anniversary celebrations. Shopclues.com సంస్థ స్విఫ్ట్
By Medi Samrat Published on 25 Dec 2020 4:25 AM GMTShopclues.com సంస్థ స్విఫ్ట్ డిజైర్ కారును బహుమతిగా ఇస్తున్నట్లుగా ఉన్న లెటర్ లో నిజం తెలుసుకోవాల్సిందిగా న్యూస్ మీటర్ కు మెసేజీ వచ్చింది.
A.విశ్వనాథ్ అనే వ్యక్తికి డిసెంబర్ 16, 2020న షాప్ క్లూస్ నుండి ఒక మెయిల్ వచ్చింది. "Shopclues Shopping Pvt Ltd is offering a prize "SWIFT DZIRE" as part of 10th Birthday Celebrations." అంటూ అందులో ఉంది. మీరు స్విఫ్ట్ డిజైర్ కారును షాప్ క్లూస్ 10వ వార్షికోత్సవంలో భాగంగా సొంతం చేసుకున్నారని తెలిపారు. ఈ కారు మీ సొంతం అవ్వాలి అంటే కేవలం డీజిల్ డబ్బులు మాత్రమే మీరు కట్టాలంటూ అతడిని కోరారు. ఆ డబ్బులు కట్టేస్తే 3 రోజులలో మీకు కారు వచ్చేస్తుంది అని తెలిపారు.
స్విఫ్ట్ డిజైర్ కారును సొంతం చేసుకోవాలంటే పలు ఐడీ కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్.టీ.ఓ. ఛార్జెస్, తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం 15600 రూపాయలు చెల్లించాలని అడిగారు.
అచ్చం ఇలాంటిదే ఫేస్ బుక్ లో కూడా నవంబర్ 2020న పోస్టు చేయడం జరిగింది.
నిజ నిర్ధారణ:
షాప్ క్లూస్.కామ్ సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా స్విఫ్ట్ డిజైర్ కారును ఇస్తోంది అంటూ జరుగుతున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ లెటర్ ను తీక్షణంగా గమనిస్తే మేనేజింగ్ డైరెక్టర్ పేరు అభిషేక్ మిట్టల్ అని ఉంది.
షాప్ క్లూస్ అన్నది భారత్ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్.. దీన్ని క్లూస్ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించింది. జులై 2011 లో సిలికాన్ వ్యాలీలో సంజయ్ సేథీ, సందీప్ అగర్వాల్, రాధిక అగర్వాల్ లు స్థాపించారు. లెటర్ లో ఉన్న అడ్రెస్ నిజమే కానీ.. ఈ సంస్థ సిఈఓ సంజయ్ సేథీ. మేనేజ్మెంట్ లో అభిషేక్ మిట్టల్ అసలు లేడు.
షాప్ క్లూస్ ను క్లూస్ నెట్ వర్క్ స్థాపించింది కానీ.. షాప్ క్లూస్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానే కాదు.
ఇక కంపెనీకి సంబంధించిన హిస్టరీ ప్రకారం.. షాప్ క్లూస్ ను 2011 లో స్థాపించారు. కాబట్టి 2021 లో 10వ వార్షికోత్సవం వస్తుంది కానీ ఇప్పుడు రాదు.
నిజమైన షాప్ క్లూస్ కంపెనీ నుండి ఇలాంటి గిఫ్ట్ లు, బంపర్ ప్రైజ్ లు ఇస్తున్నట్లుగా ప్రెస్ రిలీజ్ కూడా అవ్వలేదు. ఇక గిఫ్ట్ గెలుచుకున్నారంటూ రాసిన లెటర్స్ లో ఎన్నో వ్యాకరణ దోషాలు కూడా ఉన్నాయి. అమాయకులైన ప్రజల నుండి డబ్బులు లాక్కోవడానికే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటాయి కొన్ని గ్రూప్ లు..!
అచ్చం ఇలాంటి స్కామ్ 2018లో కూడా బయటకు వచ్చింది. షాప్ క్లూస్ నుండి ఫోన్ వచ్చిందని.. అందులో కార్ గెలుచుకున్నారు. డబ్బులు పంపించండి.. లేదంటే కారుతో సమానమైన డబ్బులను మీకు పంపిస్తామంటూ చెబుతూ ఉంటారు. నమ్మి డబ్బులు ఇచ్చారో మీ డబ్బులు ఇక తిరిగి రావు. అది కూడా కాదు అంటే ఫోన్ చేసిన వ్యక్తులను కార్ లో ఉన్న ఏదైనా ఒక పార్ట్ ను తీసుకొని డబ్బులు కట్టేయండి అని అడిగితే సమాధానం ఉండదు. ఇస్తున్న డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు మీరే తీసుకొని.. మిగిలిన డబ్బులను తమకు డిపాజిట్ చేయమని అడిగితే కూడా అటు నుండి ఎలాంటి స్పందన ఉండదు.
కారు ఇచ్చే వాళ్లు డీజిల్ డబ్బులు కోసం అడుక్కుంటారా అని కూడా ఒకసారి ఆలోచించండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది వారు చేస్తోంది పక్కా ఫ్రాడ్ పనులు అని..! కాబట్టి ఇలాంటి వాటిని ఎవరూ నమ్మకండి.
10వ వార్షికోత్సవంలో భాగంగా షాప్ క్లూస్ సంస్థ స్విఫ్ట్ డిజైర్ కార్ ను బహుమతిగా ఇస్తోందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లోనూ, ఈ మెయిల్స్ లోనూ ఎటువంటి నిజం లేదు. ఇలాంటి కాల్స్ ను కూడా అసలు నమ్మకండి. కార్ ఇస్తారు.. కొంచెం డబ్బులే కదా మనవి ఇస్తోంది అంటూ మోసపోకండి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు..! ఇలాంటి మోసాలకు బలి అవ్వకండి.