రష్యా, ఉక్రెయిన్ దాడులను ఆపేవాళ్ళు.. అమెరికాలో ఉన్న మనవాళ్ల‌ని తీసుకురాలేరా.?

విదేశాంగ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

By Medi Samrat
Published on : 7 Feb 2025 3:45 PM IST

రష్యా, ఉక్రెయిన్ దాడులను ఆపేవాళ్ళు.. అమెరికాలో ఉన్న మనవాళ్ల‌ని తీసుకురాలేరా.?

విదేశాంగ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అమెరికా నుంచి భారత పౌరులను నిర్దాక్షిణ్యంగా బేడీలు వేసి బలవంతంగా తరలిస్తుండడంతో విదేశంగా మంత్రిత్వ శాఖ వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్‌లో నిరసన చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. విదేశాంగ మంత్రి జై శంకర్‌కు దమ్ము లేదన్నారు. ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారన్నారు. విశ్వ గురువులు భయపడుతారా.? అని ఎద్దేవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ దాడులను ఆపేవాళ్ళు.. అమెరికాలో ఉన్న మనవాళ్ల‌ని తీసుకురాలేరా.? అని ప్ర‌శ్నించారు.

ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక ఇండియాకు ఇబ్బంది ఉండదని ప్రచారం చేశారు.. సరైన పత్రాలు లేని 104 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం గుర్తించి ఇండియాకు పంపింది.. ఛార్జ్ తీసుకున్నాక ట్రంప్.. ఫారిన్ పాలసీ క్లియర్ గా చెప్పాడు.. 104 మందిని టెర్రరిస్టుల లాగా తీసుకువచ్చార‌న్నారు.

కుంభమేళాను చూపిస్తున్న మోదీ మీడియా 104 మంది పరిస్థితిపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మోదీకి ప్రపంచమంతా బయపడుతద‌ని బీజేపీ వాళ్లు డబ్బా కొడతారు.. ఇజ్రాయెల్ యుద్ధం అపగలిగిన మోదీ.. అమెరికాలో ఇబ్బంది పడుతున్న వాళ్ల‌ను క్షేమంగా తీసుకురాలేకపోతున్నారన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్న జైళ్ల నుండి 44,000 మందిని తెలుగు రాష్ట్రానికి తీసుకువచ్చాం.. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నామ‌న్నారు. మా హిస్టరీ చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు.

Next Story