వాట్సాప్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఓ మెసేజీ వైరల్ అవుతూ ఉంది. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సర్వే చేస్తోందని.. ఆ సర్వేలో పాల్గొన్న వాళ్లకు బ్యాంకు 5 లక్షల రూపాయలను బహుమతిగా ఇస్తోందని తెలిపారు. ఈ సర్వేలో పాల్గొని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సర్వీసులు మెరుగు పర్చడానికి సహాయం చేసిన వాళ్ళలో 10 మందిని ఎంపిక చేస్తామని.. వారికి చెరో 5 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తామని వెల్లడించారు.
https://sxceod.shop/?app=sbi# ఈ లింక్ ను వైరల్ చేస్తూ ఉన్నారు. లింక్ క్లిక్ చేస్తే ఓ సర్వే లాంటిది ఓపెన్ అవుతుంది.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ లింక్ ఫేక్ అని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆన్ లైన్ సర్వేను అసలు ప్రకటించలేదని చెబుతోంది. ఎస్.బి.ఐ. సంస్థ ఇలాంటి క్యాష్ గిఫ్ట్ లను ఎవరికీ ఇవ్వడం లేదు.
అధికారిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ను సెర్చ్ చేయగా.. ఇలాంటి క్యాష్ ప్రైజ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా లభించలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ కు ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్న వెబ్ సైట్ లింక్ కు చాలా తేడా ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి సర్వేను నిర్వహించి ఉండి ఉంటే పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించే అవకాశం ఉంటుంది. కానీ ఇంటర్నెట్ లో ఎలాంటి కథనాలు కూడా లేవు.
ఇక కీవర్డ్ సెర్చ్ చేయగా.. ట్విట్టర్ లో ఒక యూజర్ వైరల్ మెసేజీ గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అడగ్గా.. ఆ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక సైట్ లో ఇలాంటి లాటరీ/గిఫ్ట్స్ స్కీమ్ లను ఉంచదని తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ వైరల్ మెసేజీ ఫేక్ అని తేల్చి చెప్పింది.
మేము వైరల్ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, అది అధికారిక ఎస్‌బిఐ వెబ్‌సైట్ లాగా కనిపించని వెబ్‌సైట్ లోకి వెళ్ళిపోయింది. నగదు బహుమతిని గెలుచుకోవటానికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని వెబ్‌సైట్ వినియోగదారులను కోరింది. తరువాత, బహుమతిని ఎంచుకోవడానికి వినియోగదారులకు మూడు అవకాశాలు ఇవ్వబడతాయి. రెండవ ప్రయత్నంలో వినియోగదారులు నగదును గెలుచుకుంటారని మేము గమనించాము. నకిలీ లింక్‌లతో ఉన్న అనేక నకిలీ వెబ్‌సైట్లలో ఇలాగే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిపై క్లిక్ చేయకపోవడం చాలా మంచిది.
ఒక వినియోగదారుడు బహుమతిని గెలుచుకున్న తర్వాత, బహుమతిని క్లెయిమ్ చేయడానికి ఏ ఐదు లేదా 20 వాట్సాప్ స్నేహితులకు లింక్‌ను పంచుకోవాలని అందులో కోరతారు. వినియోగదారులను వారి వ్యక్తిగత మరియు ఆర్థిక వివరాలను అందించమని అడుగుతుంది. ఇలాంటి మోసాలు చేసి వినియోగదారుల సమాచారాన్ని తీసుకుంటాయి అలాగే వారి పరికరాలను హ్యాక్ చేస్తారు. దీని వలన ఎంతో నష్టం కలుగుతుంది. దయచేసి ఇలాంటి వాటిపై క్లిక్ చేసి మోసపోకండి.
వైరల్ అవుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాటరీ లింక్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి. ఇదంతా అబద్దం.