15 అడుగుల పొడవైన పాము బుద్ధుడి విగ్రహాన్ని చుట్టుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అంత భారీ పాము బుద్ధుడి విగ్రహాన్ని చుట్టేసింది అంటూ పలువురు వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు.
ఓ యూజర్ ఇదే తరహా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రతి ఏడాది నేపాల్ లో వర్షాల సమయంలో ఇలాగే జరుగుతూ ఉంటుందని.. వర్షాలు రాగానే ఓ కొండచిలువ బుద్ధుడి విగ్రహాన్ని ఇలా చుట్టేస్తూ ఉంటుందని వెల్లడించారు. దాదాపు 15 అడుగుల కొండచిలువ ఇదంటూ చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ చేయగా 'Sangha TV' అనే యుట్యూబ్ ఛానల్ లో 13 మే 2017న "Sri Lanka buddha on snake Gautam Buddha" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
ఒరిజినల్ వీడియోలో ఉన్న పాము నిజమైన పాములా అనిపించలేదు. సాధారణంగా పాము కదిలినట్లుగా ఆ పాము కదలడం లేదు. బ్యాటరీతో పని చేసే పాములాగా అనిపిస్తోంది. పాము కళ్లు కూడా ఎర్రటి లైట్స్ తో మెరుస్తూ ఉన్నాయి.
'Knowledge, News and Fun' అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా 13 మే 2017న వీడియోను పోస్టు చేయడం గమనించవచ్చు.
వీడియో వివరణ ప్రకారం.. శ్రీలంకకు చెందిన ఒక బాలుడు ముచలిండా కోబ్రాను రూపొందించడానికి రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించాడు. ముచలిండా అంటే నాగు పాము లాంటి జీవి.. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కోరుతూ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పాము కాపాడిందనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. బుద్ధుడు బోధి చెట్టు క్రింద ధ్యానం చేయడం ప్రారంభించిన నాలుగు వారాల తరువాత ఎన్నో మార్పులు కూడా ఏర్పడ్డాయని తెలిపారు.
ఈ వీడియో నేపాల్ నుండి కాదు, శ్రీలంక నుండి వచ్చినదని ధృవీకరించడానికి న్యూస్ మీటర్ మళ్ళీ వీడియోను ప్లే చేసింది. వీడియో ప్రారంభ భాగంలో కొన్ని పదాలను గమనించగా .. అవి సింహళంలో వ్రాయబడిందని మేము కనుగొన్నాము. దీనిని సింహళీస్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా శ్రీలంకలోని సింహళ ప్రజలు మాట్లాడే భాష.
కాబట్టి వైరల్ అవుతున్న వీడియోను చిత్రీకరించింది నేపాల్ లో కాదు.. శ్రీలంకలో..! 15 అడుగుల పాము అంటూ వీడియోలో కనిపిస్తున్నది రోబో. కాబట్టి వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.