పారిశ్రామికవేత్త రతన్ టాటా చెప్పినట్లుగా పలు పోస్టులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చాలా వరకూ రతన్ టాటా చెప్పకపోయినా ఆయన చెప్పారు అన్నట్లుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రతన్ టాటా మద్యం అమ్మకం ఆధార్ ద్వారా మాత్రమే జరగాలని చెప్పినట్లుగా పోస్టులు వైరల్ అవుతోంది.
"ఆధార్ కార్డు ద్వారా మాత్రమే మద్యం అమ్మకం జరగాలి. మద్యం కొనుగోలు చేసేవారికి ప్రభుత్వ సబ్సిడీ లేదా సౌకర్యాలు ఇవ్వకూడదు. ఎవరైనా మద్యం కొనుగోలు చేయడానికి డబ్బు ఉంటే, అతను కూడా రేషన్ కొనుగోలు చేయగలడు. ఇక్కడ మేము ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నారు, వారు మద్యం కోసం డబ్బు వృధా చేస్తున్నారు. -రతన్ టాటా. " అన్నట్లుగా పోస్టులు వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్టులను పలు సోషల్ మీడియా సైట్స్ లో వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
రతన్ టాటా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NDTV, హిందూస్తాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక మీడియా సంస్థలు రతన్ టాటా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని తెలిపాయి. రతన్ టాటా యొక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని చెప్పుకొచ్చారు. పోస్ట్‌ను నకిలీ వార్తగా ఫ్లాగ్ చేశాడు. 83 ఏళ్ల పారిశ్రామికవేత్త "ఇది నేను చెప్పలేదు. ధన్యవాదాలు." అంటూ చెప్పడమే కాకుండా.. "నకిలీ వార్తలు" అనే పదాలతో GIF ఫైల్ ను పోస్టు చేశారు.
రతన్ టాటాకు ఒక ప్రకటన తప్పుగా ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో టాటా తన సంపదను మొత్తం కోవిడ్ కోసం ఖర్చు చేస్తానని వాగ్దానం చేసిన ఒక ప్రకటన వైరల్ అయింది. ఇది కూడా అబద్ధం. రతన్ టాటా లేదా టాటా గ్రూప్ ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. పలువురు ప్రముఖులు చెప్పకున్నా కూడా వారి పేర్ల మీద పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి.
కాబట్టి.. ఆధార్ కు మద్యం కొనుగోలుకు లింక్ చేయాలంటూ రతన్ టాటా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.