తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజీ సీపీఐ పార్టీ నాయకుడు నోముల నర్సింహయ్య ఇటీవలే గుండెపోటుతో మరణించారు. డిసెంబర్ 1న హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కోవిద్-19 కారణంగా ఆయన ఆసుపత్రిలో నెలరోజులుగా చికిత్స పొందుతూ వచ్చారు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఆయన్ను బాగా ఇబ్బంది పెట్టాయి.చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
ఆయన అంత్యక్రియలు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించారు. అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. నోముల కుటుంబసభ్యులను కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సీఎం కేసీఆర్... నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఆయన మరణించిన తర్వాత ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సప్ లలో నోముల ఆడియో అంటూ కొందరు వైరల్ చేస్తూ ఉన్నారు.
తన సన్నిహితులకు, స్నేహితులకు, కమ్యూనిస్టు లీడర్లకు ఆయన ఓ విషయం చెబుతున్నట్లుగా ఉంది. తనకు కమ్యూనిస్టు నేతగానే తుది వీడ్కోలు పలకాలని, సీపీఐ ఎర్ర జెండాను తన భౌతికకాయం మీద ఉంచాలంటూ ఆయన కోరారు.
పలు తెలుగు వెబ్సైట్లలో కూడా ఈ ఆడియోను అప్లోడ్ చేశారు. కథనాలను కూడా పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
నోముల నర్సింహయ్య చివరి మాటలు అంటూ వైరల్ అవుతున్న ఆడియోలో ఎటువంటి నిజం లేదు.
నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులు వైరల్ అవుతున్న ఆడియో ఆయనది కాదని చెబుతూ ప్రెస్ స్టేట్మెంట్ ను విడుదల చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఆడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని వెల్లడించారు.
https://www.andhrajyothy.com/telugunews/nomula-phone-records-family-members-202012021239103
వైరల్ ఆడియో మార్ఫింగ్ చేసినదని.. ఈ ఆడియోకు నోముల నర్సింహయ్యకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ నోముల నర్సింహయ్య ది కాదని అన్నారు. ఇలాంటి పోస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని నోముల కుటుంబం తెలిపింది.
నోముల నర్సింహయ్య పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలను ఇచ్చారు.. అందులో ఉన్న వాయిస్ కు.. వైరల్ అవుతున్న వాయిస్ కు చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని బట్టి ఈ ఆడియోలో ఉన్నది నోముల నర్సింహయ్య ది కాదని స్పష్టమవుతోంది.
నోముల నర్సింహయ్య చివరి మాటలు అంటూ వైరల్ అవుతున్న ఆడియో నిజం కాదు.