FactCheck : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీ జరిగిందా?
కేరళలోని ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలో పాల్గొంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు
కేరళలోని ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలో పాల్గొంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ పోస్ట్‌లను వైరల్ చేస్తున్నారు.
ఈ వీడియోలో, ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరించి, చంద్రవంక గుర్తు ఉన్న ఆకుపచ్చ జెండాలను పట్టుకుని ర్యాలీలో నినాదాలు చేస్తున్న పురుషుల గుంపును మనం చూడవచ్చు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ ర్యాలీ పాకిస్తాన్ అనుకూల ర్యాలీ అని, పహల్గామ్ దాడి తర్వాత జరిగిందని వినియోగదారులు చెబుతున్నారు. వీడియోలో కనిపించే జెర్సీలు, జెండాలు పాకిస్తాన్ జాతీయ జెండాను పోలి ఉన్నాయని కూడా కొంతమంది వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
"దేశవిత్రోహుల్ని రాష్ట్ర ప్రభుత్వం వదిలేస్తోంది!
కేరళలో కొంతమంది ముస్లింలు పాకిస్తాన్‌కు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటు!
ఇలాంటి చర్యలను కఠినంగా నిరోధించకపోతే, ఇవి దేశ భద్రతకు పెద్ద ప్రమాదంగా మారతాయి.
భారతదేశం మీద ప్రేమ, గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ దేశద్రోహ చర్యలను ఖండించాలి" అంటూ ఫేస్బుక్ లో పోస్టు పెట్టారు.
"ఇది కేరళలోని కోజికోడ్. వారికి ముస్లిం లీగ్ అనే పార్టీ ఉంది, వారు పాకిస్తాన్ జెండాతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులా దుస్తులు ధరిస్తారు. భారతదేశంలో మాకు శత్రువులు ఉన్నారు" అనే శీర్షికతో అదే వీడియో X లో కూడా వైరల్ అయింది.
పలు సోషల్ మీడియా ఖాతాలు ఈ వీడియోను పోస్టు చేశాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఈ వీడియో కేరళలో ముస్లింల పాకిస్తాన్ అనుకూల ర్యాలీని చూపించలేదు, పాకిస్తాన్ జెండాలను ఆ వ్యక్తులు పట్టుకోలేదు. ఏప్రిల్ 16న వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు తమ పార్టీ జెండాను పట్టుకున్నట్లు ఇది చూపిస్తుంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీలు నిర్వహించినట్లు మాకు ఎటువంటి వార్తా నివేదికలు కనిపించలేదు.
కీఫ్రేమ్‌లను జూమ్ చేసి చూస్తే, పురుషులు ధరించే ఆకుపచ్చ జెర్సీలపై 'అరంగడి' అని ఉందని మేము కనుగొన్నాము. జెండాలు, జెర్సీలపై ఉన్న చంద్రవంక చిహ్నం కూడా పాకిస్తాన్ జాతీయ జెండాకు భిన్నంగా కనిపిస్తుంది. వైరల్ వీడియోలోని జెండాలో పాకిస్తాన్ జాతీయ జెండాపై కనిపించే తెల్లటి నిలువు గీత లేదు.
వైరల్ వీడియోలోని జెర్సీలు, జెండాలు పాకిస్తాన్ జాతీయ జెండాతో పోలి లేవని స్పష్టంగా తెలుస్తుంది.
వీడియోలో, పురుషులు IUML కేరళ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్‌కు మద్దతుగా నినాదాలు చేయడం వినవచ్చు. వీడియోలో ఎక్కడా "పాకిస్తాన్" లేదా "పహల్గామ్" వంటి పదాలు వినపడడం లేదు,
వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం, ‘arangadi_official_page’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన అదే వైరల్ వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో ఏప్రిల్ 16న ‘కోజికోడ్’ అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేశారు.
అదే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, ఏప్రిల్ 15న సయ్యద్ సాదిఖాలి షిహాబ్ తంగల్ చిత్రంతో ఉన్న బ్యానర్ ను కూడా షేర్ చేశారు. ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3 గంటలకు కోజికోడ్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహిస్తున్నట్లు బ్యానర్‌లో ఉంది.
ఐయుఎంఎల్ సామూహిక నిరసనలు చేపట్టనుందనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను కూడా ప్రచురించింది. "ఏప్రిల్ 16న కోజికోడ్‌లో జరగనున్న మెగా వక్ఫ్ రక్షణ ర్యాలీతో ప్రారంభించి దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని ఐయుఎంఎల్ నిర్ణయించింది" అని నివేదిక తెలిపింది.
ఏప్రిల్ 16న జరిగిన వక్ఫ్ చట్టం నిరసనలపై మక్తూబ్ మీడియా అదే రోజు ఒక నివేదికను కూడా ప్రచురించింది. ‘కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా IUML నిరసనలో లక్షల మంది చేరారు' అని నివేదిక చెబుతోంది.
IUML కాసరగోడ్ అధ్యక్షుడు అసిమ్ అరంగడి, ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న వీడియో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోజికోడ్‌లో జరిగిన ర్యాలీ నుండి అని న్యూస్‌మీటర్ కు ధృవీకరించారు. "ఇది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీ, కాసరగోడ్ నుండి 80 మంది పాల్గొన్నారు. ఈ వీడియో ఏప్రిల్ 16న కోజికోడ్‌లో జరిగిన ర్యాలీలో రికార్డ్ చేశారు" అని అసిమ్ అన్నారు.
వైరల్ వీడియో ఏప్రిల్ 16న జరిగిన వక్ఫ్ సవరణ చట్టం నిరసన సందర్భంగా చిత్రీకరించారని స్పష్టంగా తెలుస్తుంది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీ చేపట్టలేదు.
ర్యాలీలో, పాకిస్తాన్ జాతీయ జెండాలు, జెర్సీలను ఉపయోగించలేదు. IUML పార్టీ జెండాలను ఉపయోగించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలు అబద్ధమని న్యూస్‌మీటర్ తేల్చింది.
Credits : K Sherly Sharon