తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి, నిప్పంటించి ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏతో పొత్తు పెట్టుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారనే వాదనతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఎన్‌డిఏ కూటమిలో భాగంగా 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ వీడియోలు బయటకు వచ్చాయి.
ఒక X వినియోగదారు వీడియోను పంచుకున్నారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోదీకి మద్దతు ఇచ్చినందుకు నాయుడుపై కోపంగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.” అంటూ పోస్టు పెట్టారు. (Archive)
నిజమెంత:
మార్చి 2024లో టిక్కెట్ల పంపిణీపై టీడీపీలో అసమ్మతికి సంబంధించిన వీడియో ఇది. ఆ వాదన తప్పుదారి పట్టించేలా ఉందని NewsMeter కనుగొంది.
న్యూస్‌మీటర్ తెలుగు మార్చి 29న జరిగిన ఘటనను నివేదించింది. అనంతపురం అర్బన్ సీటు దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కు టికెట్ కేటాయించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి మద్దతుదారులు టీడీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేసి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫొటోలను తగులబెట్టారని నివేదిక పేర్కొంది.
వీడియో కీఫ్రేమ్‌లకు సంబంధించిన రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం వల్ల 30 మార్చి 2024న 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదిక మాకు దారితీసింది. అనంతపురం, గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు ఫర్నిచర్, ప్రచార సామగ్రిని ధ్వంసం చేశారని నివేదిక పేర్కొంది.
మాజీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్ మద్దతుదారులు అనంతపురం, గుంతకల్‌లోని టీడీపీ కార్యాలయాలను ముట్టడించినట్లు సమాచారం. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫొటోలకు నిప్పు పెట్టారు. పార్టీ నాయకత్వం రూ.30 కోట్లకు టిక్కెట్లు అమ్ముకుంటోందని, టీడీపీలో అంకితభావంతో పని చేసే నాయకులకు గుర్తింపు లేదని మండిపడ్డారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు ఎడిషన్ సమయం తెలుగు మార్చి 29, 2024న ప్రచురించిన వీడియో కూడా మాకు దొరికింది, ‘గుంతకల్‌లో చంద్రబాబు ఫోటోను తగలబెట్టిన టీడీపీ నేతలు | గుమ్మనూరు జయరాం.’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
కాబట్టి, మా పరిశోధన ఆధారంగా ఈ వీడియో మార్చి 2024 నాటిదని.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు లేదా తర్వాత మోదీ నేతృత్వంలోని NDAకి చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపినందుకు ఈ విధ్వంసం జరగలేదని మేము నిర్ధారించాము.