FactCheck : ప్రధాని మోదీ లగ్జరీ వాచ్ ధరించారా.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:52 PM ISTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ‘శీష్ మహల్’ను నిర్మించుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2,700 కోట్ల విలువైన ‘రాజ్‌మహల్’లో నివాసం ఉంటున్నారని ఆప్ ఆరోపించింది.
ఈ సందర్భంలో ప్రధాని మోదీ ఒక గదిలో ఖరీదైన వాచ్‌ను ధరించి ఉండగా.. ఆయన చుట్టూ ఖరీదైన వస్తువులు ఉన్న చిత్రం వైరల్‌గా మారింది.
ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని పంచుకున్నారు. "ఈ ఫోటోను ప్రధానమంత్రి నివాసంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి రహస్యంగా పంపారు, కానీ ఆయన తన పిల్లలను అరవింద్ కేజ్రీవాల్ నిర్మించిన పాఠశాలలకు పంపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని ఈ ఖరీదైన వాచ్‌ని ధరించి ఉండగా అతను రహస్యంగా ఈ చిత్రాన్ని క్లిక్ చేశాడు. ఈ ‘రాజ్‌మహల్’లో ఖరీదైన విలాసవంతమైన వస్తువులైన ఫ్యాన్సీ సూట్‌లు, షూలు, గ్లాసులు, పెన్నులు, ఇతర వస్తువులకు ప్రత్యేక గదులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. 2,700 కోట్లు ఖర్చు పెడితే ఏదైనా తీసుకుని రావచ్చు" అని అందులో ఉంది.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ‘ప్రధాన మంత్రి నివాసం నుండి లీకైన ఫోటో’ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అది AI ద్వారా రూపొందించిన చిత్రం.
ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత, ఫోటోలో మేము 'Grok AI' అనే వాటర్‌మార్క్‌ను గుర్తించాము. గ్రోక్ ఇమేజ్ జనరేటర్ అనేది టెక్స్ట్ ఇన్‌పుట్‌ల ఆధారంగా విజువల్స్ సృష్టించడానికి తీసుకొచ్చిన AI సాధనం. ఇది కళాత్మక క్రియేషన్స్ కోసం ప్రత్యేకంగా సృష్టించారు.
ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించగా.. AI ద్వారా రూపొందించిన చిత్రాలలో అనేక తేడాలు ఉన్నాయని గుర్తించాం.
ప్రధాన మంత్రి కళ్లద్దాల ఫ్రేమ్ అసంపూర్తిగా ఉంది. వేళ్ల దగ్గర చూసినా కూడా స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.
మేము దాని ప్రామాణికతను నిర్ణయించడానికి AI డిటెక్షన్ టూల్స్ ద్వారా చిత్రాన్ని సెర్చ్ చేసాము.
హైవ్ మోడరేషన్ టూల్ లో 98.4 శాతం కాన్ఫిడెన్స్ స్కోర్‌తో AI ద్వారా రూపొందించిన చిత్రమని తేలింది. చిత్రం లేదా దానిలో గణనీయమైన భాగాన్ని AI ద్వారా రూపొందించిందని Wasitai ధృవీకరించింది. మరో ఏఐ డిటెక్షన్ సాధనం, AI ఇమేజ్ డిటెక్టర్, చిత్రాన్ని విశ్లేషించి, ఇది 53.26 శాతం AI-ఉత్పత్తి అని 45.18 శాతం మానవ-ఉత్పత్తిగా తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ ఇమేజ్ ను ఏఐ ద్వారా సృష్టించారు.
Credits : Md Mahfooz Alam