కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నో తప్పుడు మెసేజీలు, ఫేక్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటివో ఫోటోలను తీసుకుని వచ్చి.. ఇప్పటి ఘటనలకు సంబంధించిన ఫోటోలుగా చెబుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తూ ఉన్నారు.
అలాంటిదే ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో ఓ మహిళ ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఊపిరి తీసుకుంటూ ఉంది. అయితే ఆమె ఆసుపత్రి బెడ్ మీద లేదు.. పార్కింగ్ స్థలంలో కింద కూర్చుని ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితిని అద్దం పడుతుంది అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
పలు రాష్ట్రాల్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోస్టులు పెడుతూ ఉన్నారు.
Archive links:
https://web.archive.org/save/https://twitter.com/IsmailChand2/status/1384226476686381057
https://web.archive.org/save/https://www.facebook.com/photo?fbid=10225230882907443
నిజమెంత:
ఈ ఫోటో మీద ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినదని గుర్తించారు.
indiatimes.com కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తల్లి అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్న ఫోటో ఇది. ఆగ్రా మెడికల్ కాలేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తి అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఉండగా.. అంబులెన్స్ రావడం ఆలస్యం అయింది. దీంతో ఆ వ్యక్తి తన తల్లిని నడిపించుకుంటూ వెళుతూ భుజాల మీద గ్యాస్ సిలిండర్ మోస్తూ ముందుకు వెళ్ళాడు.
ANI యూట్యూబ్ ఛానల్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూడొచ్చు.
hindi.news18.com కథనం ప్రకారం.. అంగురి దేవి రునుక్తలో నివసిస్తూ ఉండేది. ఆమెను ఆగ్రా మెడికల్ కాలేజీ లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను జనరల్ వార్డుకు తరలించాలని అధికారులు భావించారు. అయితే జనరల్ వార్డు చాలా దూరంగా ఉంది. దీంతో అంబులెన్స్ కోసం గంటల తరబడి ఆమె, ఆమె కొడుకు బయటనే ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఘటనతో ఆమె సొమ్మసిల్లి పడిపోవడంతో తిరిగి ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో ఆసుపత్రి అధికారులు విచారణకు ఆదేశించారు.
వైరల్ అవుతున్న ఈ ఫోటోకు, ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు. 2018లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.