రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్నూలు జిల్లాలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారని వినియోగదారులు తెలిపారు.
నిరసనకారులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. #Kurnool #kurnooldistrict #Andhra Pradesh #SDPI #BanSDPI #AntiNational అనే హ్యాష్ ట్యాగ్స్ తో మెసేజీని వైరల్ చేస్తూ ఉన్నారు.
"రోడ్డుపై పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ పాకిస్థానీ మద్దతుదారులకు మనం ఎందుకు అంత స్వేచ్ఛ ఇస్తున్నాం? ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం. దేశానికి ద్రోహం చేసిన ఈ ఉగ్ర వాదులను శిక్షించాలి. #Kurnool #kurnooldistrict #Andhra Pradesh #SDPI #BanSDPI #AntiNational," అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అధికారులు అనుమతి నిరాకరించడంతో ఈ వారం కర్నూలులోని హొళగుంద బస్టాండ్‌లో జరిగిన ధర్నాకు సంబంధించిన వీడియో ఇది.
ధర్నా సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదం చేయలేదంటూ ఫేస్‌బుక్‌లో 'ఎస్‌డిపిఐ హొళగుంద', 'పిఎఫ్‌ఐ హొళగుంద' క్లారిటీ ఇచ్చాయి. 'పాపులర్ ఫ్రంట్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశామని తెలిపారు.
ఎస్‌డిపిఐ ఆలూరు అసెంబ్లీ కార్యదర్శి మాట్లాడుతూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని కొందరు అంటున్నారు. అక్కడ ఉన్న ప్రజలు పాపులర్ ఫ్రంట్ జిందాబాద్ అని చెబుతుండగా.. పాకిస్తాన్ జిందాబాద్‌గా మార్చారు. దానిని వైరల్ చేస్తున్నారని విమర్శించారు. ఇది అబద్ధం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేసిన వారిపై కేసు నమోదు చేయడానికి మేము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. పిఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ధర్నా సందర్భంగా 'పాపులర్ ఫ్రంట్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారని పిఎఫ్‌ఐ హొళగుంద విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
కాబట్టి కర్నూలులో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయలేదు.