FactCheck : నదిలో కొట్టుకుపోతున్న బస్సు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుందా..?

Old WB Bus Mishap Passed Off AS Recent Incident in Andhra. ఓ బస్సు నదిలో కొట్టుకుపోతూ ఉంటే.. అందరూ చూస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2021 11:58 AM GMT
FactCheck : నదిలో కొట్టుకుపోతున్న బస్సు.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుందా..?

ఓ బస్సు నదిలో కొట్టుకుపోతూ ఉంటే.. అందరూ చూస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. కడప జిల్లా, నందలూరు లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

వరద ఉధృతికి బస్సు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నారు. చివరకు బస్సు, జనం ఇద్దరూ వరద నీటిలో కొట్టుకుపోయారు. కనీసం 50 మంది వరకు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి తుపాను వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. వైఎస్‌ జగన్‌, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆస్తినష్టం, పంట నష్టం, ప్రాణనష్టం ఇలా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో కచ్చితంగా అంచనా వేసే వారు లేరు. అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

'కడప జిల్లా, నందలూరు లో జరిగిన ఘటన..

వరద ఉద్దృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో Bus పైకెక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా.. చివరికి ఆ Bus తో పాటు వరద నీటిలో మనుషులు కొట్టుకుపోయారు.. దాదాపు 50 మంది ఉండొచ్చు అని స్థానికుల అంచనా..


మునుపెన్నడూ లేని విపత్తు సంభవిస్తే వీడికి కానీ.. వీడి మంత్రులు కానీ కనీస ప్రస్తావన' అంటూ మరికొందరు పోస్టులు చేశారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

NewsMeter InVid సాధనాన్ని ఉపయోగించి కీఫ్రేమ్‌లను తీసుకుని వెతకడం మొదలుపెట్టింది. ఈ వీడియో 2014 నుండి YouTubeలో అందుబాటులో ఉందని మేము కనుగొన్నాము. దీన్ని బట్టి ఈ వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది. వీడియో యొక్క శీర్షికలో "Bus and Passengers Washed Away in West Bengal River 2012".( "పశ్చిమ బెంగాల్ నదిలో కొట్టుకుపోయిన బస్సు మరియు ప్రయాణీకులు 2012") అని ఉంది.


సెప్టెంబరు 7, 2012న 'ABP న్యూస్' యూట్యూబ్‌ ఛానల్ లో అప్‌లోడ్ చేసిన మరొక వీడియోను మేము కనుగొన్నాము. దాదాపు 70 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో భైరబ్బంకి నదిపై వంతెనను దాటుతున్నప్పుడు కొట్టుకుపోయింది.


మా బృందం 'న్యూస్18' ద్వారా సెప్టెంబరు 7, 2012 నాటి వార్తా నివేదికను కనుగొంది. నివేదిక ప్రకారం.. 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు వంతెనను దాటినప్పుడు వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బంకురాలోని భైరాబంకి నదిలో పడిపోయింది. న్యూస్ ఆర్టికల్ నివేదికలో కూడా ఇదే చిత్రాన్ని కలిగి ఉంది.


మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం యొక్క అధికారిక ఖాతాను కనుగొన్నాము. అందులో వైరల్ పోస్టులో ఉన్నది అవాస్తవమని తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బస్సు దుర్ఘటనకు సంబంధించిన 9 ఏళ్ల నాటి ఫుటేజీ ఇది అని ట్వీట్ చేసింది. అసలు వీడియో వ్యవధి 84 సెకన్లు అని.. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో అని స్పష్టంగా తెలిపింది.

కాబట్టి కడప జిల్లా, నందలూరు లో జరిగిన ఘటన అంటూ వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Next Story