పగటిపూట నైటీలు ధరిస్తే మహిళలకు 2000 రూపాయలు జరిమానా విధిస్తామని ఉన్న తెలుగు దినపత్రిక క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా పెద్ద ఎత్తున వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు కూడా..!
నిజ నిర్ధారణ :
ఇది లేటెస్ట్ వార్త అయితే కాదు.. 2018లో చోటు చేసుకున్న ఘటన. ప్రభుత్వానికి ఈ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేదు.
కీవర్డ్ సెర్చ్ చేయగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోల లింక్ లు దొరికాయి. ఆడవాళ్లు నైటీ వేసుకొని బైటికొస్తే ఫైన్ వేస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అప్పట్లోనే అధికారులు అప్రమత్తమై విచారణ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లిలో అప్పట్లో ఊరి పెద్దల కమిటీ ఈ నిబంధనలను తీసుకుని వస్తున్నట్లు తెలిపింది.
తోకలపల్లి గ్రామంలో నైటీలతో రోడ్లపైకి వస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారని.. నైటీ వేసుకున్న ఆడవాళ్లని చూపిస్తే రూ.వెయ్యి నజరానాగా ఇస్తున్నారనే విషయం అప్పట్లో సంచలనం రేపింది. ఈ రూల్ అతిక్రమిస్తే ఏకంగా గ్రామం నుంచి వెలి వేస్తామనే గ్రామ పెద్దల కమిటీ నిర్ణయం కలకలం రేపింది. అలా వసూలు చేసిన డబ్బు డ్రామాభివృద్దికి వినియోగిస్తామని చెప్పారు.
India Today లో నవంబర్ 2018లో ఆర్టికల్ కూడా వచ్చింది. తోకలపల్లిలో అత్యధికులు పల్లెకారు కుటుంబాలకు చెందినవారే. వీరు ఇక్కడ 9 మందితో ఒక కుల పెద్దల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో పగటి పూట నైటీల ధారణ విషయం వీరి దృష్టికి వచ్చింది. ఆడవాళ్లు పొద్దున్నే నైటీలు వేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టి ఫైన్ వేస్తామని ప్రకటించారు. మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, వస్తే రూ.2 వేలు జరిమానా అంటూ దండోరా వేయించారు. రాత్రి పూట మాత్రమే వాటిని ధరించాలని.. పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపినవారికి రూ.1,000 ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గ్రామ బహిష్కరణకు వెనుకాడేదిలేదని కులపెద్దలు తీవ్ర హెచ్చరికలు చేశారు.
విషయం తెలుసుకున్న గ్రామ తహసీల్దార్ సుందర్‌రాజు, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. గ్రామ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఏ ఒక్క మహిళ కూడా ముందుకు రాకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది.
2018 నాటి పాత వార్త క్లిప్పింగ్ ఇటీవలి సంఘటనగా షేర్ చేయబడుతోంది. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.