Fact Check : మళ్లీ పాకిస్తాన్ లో టీవీలు పగిలాయా..?

Old Image of Pakistani Fans Breaking Television Sets Shared as Recent. టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2021 4:37 PM GMT
Fact Check : మళ్లీ పాకిస్తాన్ లో టీవీలు పగిలాయా..?

టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఫైనల్ చేరకుండానే ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్ లో పాక్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 19 ఓవర్లలోనే ఛేదించారు. మాథ్యూ వేడ్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్ తో మరో ఓవర్ మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.

T20 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా పాక్ ను ఓడించిన తర్వాత.. పాక్ లో కోపంగా ఉన్న అభిమానులు తమ టీవీలను పగలగొట్టినట్లు చూపించే కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.

ఈ చిత్రాలలో, కొందరు వ్యక్తులు రోడ్డుపై టీవీ సెట్లను పగలగొట్టడం చూడవచ్చు. చిత్రాలలో, కొంతమంది పాకిస్తాన్ జట్టు క్రికెట్ జెర్సీని ధరించి కనిపించారు.

నిజ నిర్ధారణ :

NewsMeter గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది. ఇది మమ్మల్ని మార్చి 19, 2016 నాటి వెబ్‌సైట్ గెట్టి ఇమేజెస్ కు దారితీసింది. " T20 ప్రపంచ కప్ సందర్భంగా భారత్‌తో తమ క్రికెట్ జట్టు ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ యువకులు టీవీ సెట్‌ను పగలగొట్టారు. మార్చి 19, 2016న కరాచీలో ఈ ఘటన చోటు చేసుకుంది" అని రాసి ఉంచారు.

మార్చి 21, 2016న 'ఖలీజ్ టైమ్స్' లో మ్యాచ్ ఓడిపోయినందుకు అఫ్రిదిని తిట్టారు, అభిమానులు టీవీ సెట్లను పగలగొట్టారు అనే శీర్షికతో నివేదించారు. "శనివారం కోల్‌కతాలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారతీయులు విజయం సాధించిన వెంటనే, నిరాశ చెందిన క్రికెట్ అభిమానులు తమ కోపాన్ని వెళ్లగక్కేందుకు రోడ్లపైకి వచ్చారు మరియు టెలివిజన్ ఛానెల్‌లు కొన్ని ప్రాంతాల్లో కోపంతో టీవీ సెట్‌లను పగులగొట్టినట్లు చూపించాయి" అని నివేదికలో ఉంది.

ఇదే విధమైన వార్తల నివేదికను ది ఎకనామిక్స్ టైమ్స్, న్యూస్ 18 మరియు డెక్కన్ క్రానికల్ కూడా ప్రచురించాయి.

టీవీ సెట్‌లను పగలగొట్టిన అభిమానుల వీడియో నివేదిక మార్చి 20, 2016న 'Oneindia News' యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది. వీడియో యొక్క వివరణ ఇలా ఉంది, "భారత్‌ పాక్ ను ఓడించిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్న సమయంలో... ఆగ్రహంతో ఉన్న పాక్ అభిమానులు తమ కోపాన్ని, చిరాకును వెళ్లగక్కారు.విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన తర్వాత పాక్ క్రికెట్ అభిమానులు బ్యాట్‌లు కాల్చడం, టీవీ సెట్లు పగలగొట్టడం కనిపించింది" అని ఉంది.

2016లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్ ను ఓడించిన తర్వాత పాక్ అభిమానులు టీవీ సెట్‌లను ధ్వంసం చేసిన ఈ ఫోటో 2016 సంవత్సరం లోనిది. ఈ చిత్రం ఇటీవల సెమీ ఫైనల్ లో పాక్ ఓడిపోయిన తర్వాత తీసినవి కావు.


Next Story