నీట మునిగిన ఓ ఇంట్లో చేపలు ఈదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల వరదల సమయంలో తిరుపతిలో ఇలా జరిగిందని సోషల్ మీడియా యూజర్లు చెబుతూ ఉన్నారు. తెలుగులో క్యాప్షన్‌తో పాటు వీడియో షేర్ చేయబడింది. "తిరుపతిలోని ఇంట్లో చేపలు" అని ఉన్న వీడియోలో ఇంట్లోనే పెద్ద పెద్ద సైజ్ ఉన్న చేపలు ఈదుతూ ఉండడాన్ని చూడవచ్చు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియోకు.. తిరుపతికి ఎటువంటి సంబంధం లేదు.
న్యూస్‌మీటర్ వైరల్ వీడియో స్క్రీన్‌షాట్ ను తీసుకుని.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. నవంబర్ 2020లో ఇలాంటి దృశ్యాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ వీడియోలను మీరు చూడవచ్చు. వివరణ ప్రకారం ఈ వీడియోను సిద్ రజాలి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వివరాల ఆధారంగా, మేము సిద్ రజాలి ఖాతా హ్యాండిల్స్ కోసం వెతికాము, ట్విట్టర్ ఖాతాను కనుగొన్నాము. అతను నవంబర్ 24, 2020న వీడియోను షేర్ చేశారు. సిద్ రజాలి తన ట్వీట్‌లో చేపల గురించి ప్రస్తావించారు. తన ఇల్లు వరదలో మునిగిపోయిన వీడియోను కూడా ట్వీట్ చేశారు.
వీడియోలో వాడిన భాష 'మలయ్'. ఇది అధికారికంగా మలేషియా, సింగపూర్, బ్రూనై మరియు ఇండోనేషియాలో మాట్లాడతారు. దానిని క్లూగా తీసుకుని, మేము ఆయా దేశాల్లో సంబంధిత వార్తల కోసం వెతికాము. సంఘటనపై అనేక వార్తా నివేదికలను కనుగొన్నాము. మలేషియాలోని తేరాగన్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని వార్తా కథనాల ద్వారా తెలిసింది.
"మలేషియాలో మనం ప్రతి సంవత్సరం అనుభవిస్తున్న వరద సమస్యలకు ఈ వీడియో చక్కని ఉదాహరణ" అని మరొక కథనం పేర్కొంది. ఇలాంటి దృశ్యాలతో కూడిన వీడియోను 20 నవంబర్ 2020న కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలను మీరు చూడవచ్చు.
భారీ వర్షాల కారణంగా తిరుపతి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయంటూ పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తిరుపతిలోని కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరినట్లు కథనాలు వచ్చాయి. తిరుపతి వరదల్లో చేపలు కొట్టుకుపోయాయని కొన్ని న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. కానీ, వైరల్ అయిన వీడియో తిరుపతి వరదలకు సంబంధించినది కాదు.
కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. వైరల్ వీడియో మలేషియాలో చోటు చేసుకుంది. ఒక ఏడాది కిందటి వీడియో ఇది.