వరదలతో నిండిన హైవేపై వాహనాలు నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో భారత్‌కు చెందినదని ప్రచారం జరుగుతోంది.
"ఇన్‌క్రెడిబుల్ ఇండియా! నేను ఎట్టకేలకు అత్యంత అందమైన నీటి రహదారిని చూశాను" అని గ్రీన్ బెల్ట్, రోడ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో వీడియోను పంచుకున్నారు. ఈ ట్వీట్ కు పెద్ద సంఖ్యలో రీ ట్వీట్లు వచ్చాయి.. లక్షల్లో లైక్స్ వచ్చాయి.
మరికొందరేమో ఇది పాకిస్థాన్ కు చెందిన వీడియో అని చెప్పడం గమనించవచ్చు. ఇండస్ హైవే.. సింధ్-పాకిస్థాన్ కు చెందినదని పలువురు చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ వీడియోను సింధ్ ప్రావిన్స్.. పాకిస్థాన్‌లోని సింధు రహదారిని చూపుతున్నట్లు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించింది. ఇది 10 జూలై 2021న ధృవీకరించబడిన Twitter హ్యాండిల్, బ్యూటిఫుల్ చైనా ద్వారా పోస్ట్ చేయబడిందని కనుగొంది. వీడియో "E China's Jiangxi" నుండి వచ్చింది. వరదల సమయంలో, నీటి మట్టం 18.67 మీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు యోంగ్‌క్సియు-వుచెంగా రహదారిలో కొంత భాగం ముంపునకు గురైంది.
చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా పీపుల్స్ డైలీ చైనా ధృవీకరించబడిన ఫేస్‌బుక్ పేజీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది. వరదల సమయంలో యోంగ్‌క్సియు-వుచెంగ్ రోడ్‌లోని కొంత భాగం నీటిలో మునిగిపోయినప్పుడు ఈ వీడియో తీశారని పేర్కొంది.
పోయాంగ్ సరస్సు గుండా వెళుతున్న యోంగ్‌క్సియు-వుచెంగ్ రహదారి వర్షాకాలం ప్రారంభంతో నీటిలో మునిగిపోతుందని పేర్కొంటూ మేము ఒక కథనాన్ని కూడా కనుగొన్నాము.
ఈ వైరల్ వీడియో భారత్‌కు చెందినదనే వాదన అవాస్తవం.