కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..! కరోనా మహమ్మారి బారిన పడకుండా తప్పించుకోడానికి ప్రజలు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. రోగ నిరోధక శక్తి కోసం కొన్ని పదార్థాలను ఎక్కువగా తింటూ ఉన్నారు కూడానూ..! కొన్ని తప్పుడు మెసేజీలు, వదంతులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి.

అలాంటి వాటిలో 'నిమ్మకాయ రసం ముక్కులో వేసుకుంటే కరోనా దూరం అవుతుంది'. అందుకు సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

'లెమన్ థెరపీ' అంటూ ఓ వ్యక్తి వీడియో చేశారు. ఎక్కడ నిమ్మకాయ ఉంటుందో అక్కడ కరోనా ఉండదు అంటూ ఆ వీడియోలో సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. మూడు చుక్కలు నిమ్మకాయ రసం ముక్కులోకి వేసుకుంటే క్షణాల్లో పని చేయడం మొదలవుతుందని అన్నారు. శరీరంలోని అన్ని భాగాలోని మలినాలు కూడా బయటకు వచ్చేస్తాయని చెప్పారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ డాక్టర్ ఎస్.ఎన్.అరవింద(కన్సల్టెంట్-ఇంటర్నల్ మెడిసిన్ అట్ ఆస్టర్ ఆర్.వి.హాస్పిటల్, బెంగళూరు) తో మాట్లాడగా.. నిమ్మరసం ముక్కులో వేసుకోవడమన్నది చాలా తప్పు అని అన్నారు. అలా చేయడం వలన ముక్కులో మాన్తా పుట్టడమే కాకుండా అల్సర్లకు దారి తీస్తుందని స్పష్టం చేశారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు స్పష్టం చేశారు. విటమిన్ సి అన్నది ఇమ్యూనిటీని పెంచుతుందని.. ముక్కులోకి నిమ్మరసం వేసుకొనే బదులు.. నిమ్మకాయతో జ్యూస్ చేసుకుని తాగడం మంచిదని అన్నారు.. అలా చేస్తే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని వెల్లడించారు. తినే పదార్థాలలో నిమ్మరసం తీసుకోవడం వలన శరీరానికి మంచి జరుగుతుందని అన్నారు.

విపరీతంగా నిమ్మకాయలను వాడాక కోవిడ్-19 నుండి స్వస్థత పొందొచ్చు అని అనుకోవద్దని అన్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టులు చేయించుకోవడం చాలా బెటర్ అని అన్నారు. వైద్యులను సంప్రదించి సూచనలను పాటించడం చాలా మంచిదని తెలిపారు. ఇక వ్యాక్సిన్ దొరికితే వేయించుకోవడం మరవద్దని తెలిపారు.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపింది. ముక్కుల్లో నిమ్మరసం వేసుకుంటే కరోనా రాదనే వార్తను అసలు నమ్మొద్దని.. శాస్త్రీయంగా నిరూపితమైనదని కాదని స్పష్టం చేసింది.

DNA, Jagran, Navbharattimes మీడియా సంస్థలు కూడా నిమ్మరసం ముక్కుల్లో పిండుకోవడం మంచిది కాదని తెలిపాయి. నేషనల్ అకాడెమీస్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ మెడిసిన్ వెబ్సైట్ లో కూడా నిమ్మరసాన్ని ముక్కుల్లోకి వేసుకుంటే కరోనా నశిస్తుందని ఎక్కడా ఋజువు కాలేదని తెలిపారు.

నిమ్మరసాన్ని ముక్కుల్లో పిండుకుంటే కరోనా నశిస్తుందంటూ వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review :   నిమ్మరసం ముక్కు లోకి వేసుకుంటే కరోనా అంతమవుతుందా..?
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story