FactCheck : ఆ మృతదేహాలు నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన వారివేనంటూ ప్రచారం..!

No, this video does not show victims of recent Nepal plane crash. తెల్లటి గుడ్డలో మృతదేహాలను కప్పి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 Jan 2023 3:26 PM

FactCheck : ఆ మృతదేహాలు నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన వారివేనంటూ ప్రచారం..!

తెల్లటి గుడ్డలో మృతదేహాలను కప్పి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన 72 మంది ప్రయాణికుల మృతదేహాలు ఇవి అంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.

జనవరి 15న, నేపాల్‌లోని పోఖారా సమీపంలో 72 మందితో ప్రయాణిస్తున్న యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. మీడియా నివేదికల ప్రకారం 71 మంది చనిపోయారని అంటున్నారు.


ట్విటర్‌లో ఓ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, “నేపాల్ విమానం కూలిన ఘటనలో చనిపోయిన వారి 72 మంది మృతదేహాలు." అంటూ పోస్టు పెట్టారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

ఈ వీడియో ఇండోనేషియాకు చెందినదని న్యూస్‌మీటర్ బృందం కనుగొంది. బ్రతికి ఉన్న మనుషులు శవాలుగా నటించే మతపరమైన ఆచారం ఇదని గుర్తించాం.

వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, మేము డైలీ మోషన్‌లో 31 అక్టోబర్ 2022న అప్లోడ్ చేసిన అసలు వీడియోను కనుగొన్నాము. క్యాప్షన్ ప్రకారం, వీడియో బాలికి చెందినది.. 'వటంగన్ మాతా లేదా కార్ప్స్ మాతా' అని పిలువబడే ఆచారం ఇదని చెబుతున్నారు.

శవాలుగా మారడానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చారని తెలుస్తోంది.

పలు ట్విటర్‌, ఫేస్‌బుక్‌ పేజీలు కూడా వీడియోను పోస్ట్‌ చేశాయి. 30 అక్టోబర్ 2022న బాలిలోని తబానన్‌లోని కేతుట్ మారియా ఆర్ట్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో “వటంగన్ మాతా” ఆచారాలను ఈ వీడియోలో చూపుతోందని అన్ని పోస్ట్‌లు ధృవీకరిస్తున్నాయి.

బాలి ట్రిబ్యూన్ ప్రచురించిన కథనంలో మేము వీడియోకు సంబంధించిన స్టిల్‌ను కూడా కనుగొన్నాము. ఇండోనేషియా యూత్ నేషనల్ కమిటీ (KNPI) ఈ కార్యక్రమం కోసం DPD తబనన్ రీజెన్సీ సుసి ఫౌండేషన్‌తో కలిసి పని చేసిందని కథనాల్లో ఉన్నాయి.

ఈ వీడియో ఇండోనేషియాలోని బాలికి చెందినదని స్పష్టమైంది. నేపాల్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి వీడియో ఇదనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Next Story