ప్రభుత్వోద్యోగుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని తెలుగులో ఓ మెసేజీ వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతూ ఉంది.
ఉత్తర్వులు పాటించని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కల్పించబోమని, ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకోవాల్సి వస్తుందని మెసేజ్‌లో ఉంది.
"ప్రభుత్వంలో పని చేసేవారు ఎవరైనా సరే ..... అటెండర్ దగ్గర నుంచి... జిల్లాకలెక్టర్ వరకు!.. తప్పనిసరిగా తమ తమ పిల్లలను!... ప్రభుత్వ విద్యాలయాలోనే చదివించాలి!.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ!... లేకపోతే ప్రమోషన్లు ఉండవు!.. ఇంక్రిమెంట్లు ఉండవు!!... ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు.... వదులుకోవాల్సి వస్తుంది." అంటూ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదని న్యూస్ మీటర్ ధృవీకరించింది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసిందా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. విశ్వసనీయమైన మీడియా సంస్థల ద్వారా మాకు ఎలాంటి నివేదిక అందలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి నివేదిక వచ్చినా కూడా వార్తల్లో తప్పనిసరిగా వచ్చి ఉండేది. అలాంటి ప్రకటన లేదని తేలింది.
మేము తెలంగాణ ముఖ్యమంత్రి వెబ్‌సైట్‌లో పత్రికా ప్రకటనలను కూడా విశ్లేషించాము, కానీ వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన ఆర్డర్ ఏదీ కనుగొనలేకపోయాము. తాజా పత్రికా ప్రకటన ప్రకారం డిసెంబర్ 15 నుండి సిఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో సాధారణ ట్రాఫిక్‌ను ఆపకుండా ఉండాలని, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని పోలీసులను కోరారు ముఖ్యమంత్రి.
టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్‌మోహన్‌రెడ్డి న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. అలాంటి ఉత్తర్వులేవీ జారీ కాలేదని ధృవీకరించారు. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి అటువంటి అధికారిక ఉత్తర్వులు ఏవీ రాలేదని.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఫేక్ మెసేజ్‌లను నమ్మవద్దన్నారు.
మేము CMOలోని పబ్లిక్ రిలేషన్స్ అధికారిని కూడా సంప్రదించాము, ఆయన వైరల్ సందేశం ఫేక్ అని.. అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ధృవీకరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్న వాదన అవాస్తవమని స్పష్టంగా తెలుస్తోంది.
Credits : Md Mahfooz Alam