ఓ ఎరుపు రంగు చుక్క ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఎరుపు రంగు చుక్కను చూడడం ద్వారా మీ కళ్లు సరిగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చని ఆ వైరల్ మెసేజీలో వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు ఈ పరీక్షను కనిపెట్టారని. ఆ ఎరుపు రంగు చుక్కలో మీకు కనిపించే నంబర్ ద్వారా మీ కళ్లు సరిగా పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవచ్చని వైరల్ మెసేజీలో తెలిపారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ మెసేజీ 'ఒక గాలి వార్త'. ఆ మెసేజీలో ఉన్న టెస్టుకు ఎటువంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు.
వైరల్ అవుతున్న మెసేజీలో ఉన్న నెంబర్ ను న్యూస్ మీటర్ సంప్రదించింది. ముంబై కు చెందిన విశాల్ వానిని సంప్రదించాము. విశ్వా మెడికల్ కోచింగ్ సెంటర్ ఓనర్ ఆయన.
దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ వైరల్ పోస్టును తామే షేర్ చేశామని.. అయితే ఇది మెడికల్ రీసర్చ్ కానే కాదని ఆయన తెలిపారు. ఒక వేళ మీరు ఆ ఎరుపు రంగు చుక్కలో ఎటువంటి నెంబర్ ను చూడకపోతే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని అన్నారు. అంతే తప్పితే దీన్నే ప్రామాణికంగా తీసుకోకూడదని తెలిపారు.
ఫేస్ బుక్ లో 2019లోనే ఈ ఫోటోను పోస్టు చేశారు. హర్యానా లోని లైఫ్ లైన్ క్లినిక్ ఇదే ఫోటోను పోస్టు చేసింది. ఫోటోలో ఉన్న నెంబర్ ను న్యూస్ మీటర్ సంప్రదించగా.. వారు సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఆ తర్వాత పోస్టును డిలీట్ చేశారు.
అమెరికాకు చెందిన కంటి వైద్యులు ఈ టెస్టును తయారు చేశారా..?
అమెరికాకు చెందిన కంటి వైద్యులు ఈ పరీక్షను తయారు చేశారని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. అందుకు సంబంధించిన ఎటువంటి వార్తలు కూడా లభించలేదు.
ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు చెందిన రెటీనా స్పెషలిస్ట్ వివేక్ దవే ను న్యూస్ మీటర్ సంప్రదించగా.. ఇలాంటి టెస్టులను నమ్మకండని.. ఇందులో ఎటువంటి శాస్త్రీయకత లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి టెస్టులు సామాజిక మాధ్యమాల్లో చాలానే వైరల్ అవుతూ ఉన్నాయని.. కంటి సమస్యలు ఉంటే వెంటనే ఐ స్పెషలిస్టులను సంప్రదించాలని సలహా ఇచ్చారు.
ఎరుపు రంగు చుక్కను చూసి మన కళ్లను పరీక్షించుకోవచ్చంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.