కొందరు ముస్లింలు ఓ పోలీసు అధికారిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. మే 28, 2021న ఈ ఘటన చోటు చేసుకుందంటూ పలువురు సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోను అప్లోడ్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఒక గుంపు చేతిలో హైదరాబాద్ పోలీసు దెబ్బలు తిన్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. వేరే ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను హైదరాబాద్ లో చోటు చేసుకున్నదిగా చెబుతున్నారని.. వాటిలో ఎటువంటి నిజం లేదని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ మీడియా, తెలంగాణ ప్రభుత్వం, కొణతం దిలీప్ కూడా ఈ కథనాల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని న్యూస్ మీటర్ తెలుగు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఘటన అక్టోబర్ 2020లో చోటు చేసుకున్నదిగా తెలుస్తోంది. గుజరాత్ కు చెందిన మీడియా సంస్థలు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాయి.
అహ్మదాబాద్ లో తాగి ఉన్న పోలీసును ఆరుగురు వ్యక్తులు కొట్టినట్లుగా అక్టోబర్ 2020లో కథనాలు వచ్చాయి. సోలా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దెబ్బలు తిన్న పోలీసు అధికారిని సునీల్ సింహ్ చౌహాన్ గా గుర్తించారు. అర్ధరాత్రి 12:45 సమయంలో పాన్ షాప్ దగ్గరకు వెళ్లిన సునీల్.. అక్కడి వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పటికే తాగి ఉన్న సునీల్ ఇష్టం వచ్చినట్లు అక్కడి వాళ్ళను తిట్టడంతో అందరూ కలిసి అతడిని కొట్టడం జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలోని సోలాలో తాగి ఉన్న పోలీసు కానిస్టేబుల్ ను కొట్టిన వీడియోకు హైదరాబాద్ లోని పోలీసులకు లింక్ చేస్తూ వీడియోలను పోస్టు చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు.