రక్తదానం చేసిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్ష వరకు ఉచిత వైద్యం అందజేస్తుందనే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రక్తదానం చేసే వారికి ఏడాదికి లక్ష రూపాయల వరకూ ఉచిత వైద్యం అందజేయనున్నారనే పోస్టులు వైరల్ అవుతున్నాయి.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వెతికితే రక్తదానం చేసే వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఎలాంటి పత్రికా ప్రకటన కానీ, జీఓ కానీ జారీ చేయలేదని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాన్ని ప్రకటించి ఉంటే, అన్ని ప్రముఖ వార్తా సంస్థలు దానిని నివేదించేవి. కానీ మాకు అలాంటి నివేదికలు ఎక్కడా కనిపించలేదు.
డిసెంబర్ 2021 నాటికి ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులకు కొత్త రూపు వస్తుందని 11 నవంబర్ 2021న న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు, నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. రక్తదానం చేసిన వారికి వైద్య సహాయంగా సంవత్సరానికి లక్ష రూపాయలు ఉచిత వైద్యం ఇస్తున్నట్లుగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
రక్తదానం చేసిన వారికి ఉచిత వైద్యం అందించాలనే కాన్సెప్ట్‌ను 'సేవ్‌యో' అనే రక్తదాన సంస్థ మొదలుపెట్టిందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇటీవల ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.
ఈ పథకం ఇప్పటికే జరుగుతోందని మరియు దానికి అవసరమైన డబ్బును Suits.life అలాగే కొన్ని NGOలు, రక్తదాన శిబిరాల ద్వారా అందించబడుతున్నాయని SaveYo సంస్థ Factly అనే ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌కి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వైరల్ పోస్టులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం అవుతోంది.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. రక్తదాన కేంద్రం అయిన సేవ్‌యో ఆంధ్రప్రదేశ్‌లోని రక్తదాతలకు రూ.లక్ష వరకు ఉచిత వైద్యం అనే కాన్సెప్ట్‌తో ముందుకు వచ్చింది. దీనికి ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.