FactCheck: ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే వాదనలో నిజం లేదు
రెండు వీడియో క్లిప్‌ల కోలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Feb 2025 9:30 PM IST
రెండు వీడియో క్లిప్‌ల కోలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మొదటి క్లిప్‌లో ఒక అమ్మాయి ఒక వ్యక్తి నుండి పారిపోతున్నట్లు ఉండగా.. రెండవది పోలీసు కస్టడీలో వ్యక్తి కుంటుతున్నట్లు చూపిస్తుంది.
ముస్లిం సమాజాన్ని విమర్శిస్తూ ఈ విజువల్స్ ను వాడుతూ పోస్టులు పెట్టారు. రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే వీడియోలోని వ్యక్తి హిందూ బాలికను వేధించినందుకు అరెస్టు చేశారని పోస్టులో తెలిపారు.
"ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేసేవాడు, వీధిలో ఒక అమ్మాయిని వేధించాడు" అనే శీర్షికతో ఒక X వినియోగదారు వీడియోను పంచుకున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ముజఫర్‌నగర్ పోలీసులు నిందితుడు హిందూ వర్గానికి చెందిన రోహిత్‌గా గుర్తించారు.
మేము కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము. వీడియోలు ఫిబ్రవరి 5న దైనిక్ భాస్కర్, ఫిబ్రవరి 6న ఆజ్ తక్ మీడియా రిపోర్ట్‌లలో కనిపించాయి. ఈ నివేదికల ప్రకారం, ముజఫర్‌నగర్‌లోని న్యూ మండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
ఆన్‌లైన్‌లో వైరల్ వీడియో సర్క్యులేట్ అయిన రెండు గంటల్లోనే రోహిత్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ముజఫర్‌నగర్ పోలీసులు, X పోస్ట్ ద్వారా, వీడియో వైరల్ అయిన తర్వాత, న్యూ మండి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకొని ముజఫర్‌నగర్‌లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని విలాయత్ నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. సమయ్ సింగ్ కుమారుడు రోహిత్‌ను దుష్ప్రవర్తన, వేధింపులకు సంబంధించి అరెస్టు చేశారని పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని రోహిత్‌గా గుర్తించినట్లు ధృవీకరిస్తూ పోలీసుల ప్రకటన ఉంది.
కేసు గురించి ఆరా తీయడానికి న్యూస్‌మీటర్ న్యూ మండి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. ఘటనలో మతపరమైన కోణం లేదని పోలీసులు ధృవీకరించారు. నిందితుడు రోహిత్.. సమయ్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు. ఈ కేసులో భాగమైన వ్యక్తులందరూ హిందూ సమాజానికి చెందినవారని పోలీసులు తెలిపారు.
మేము ఫిబ్రవరి 5 నాటి ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా యాక్సెస్ చేసాము. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, వీడియోలోని మహిళ గత ఏడాది కాలంగా తనను వేధిస్తున్నందుకు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు రోహిత్‌పై కేసు నమోదు చేసింది. BNS ప్రకారం, రోహిత్‌పై సెక్షన్ 78, 127(2), 351(2) కింద అభియోగాలు మోపారు.
అందువల్ల, వైరల్ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam