పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇక ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా, భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనే విషయాన్ని కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. తాజాగా గంగూలీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. 'స్వాగతం దాదా' అంటూ బెంగాలీలో పలువురు పోస్టులు పెట్టడం.. వైరల్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఇంతలో ఇతర పార్టీలకు చెందిన వారు కూడా సౌరవ్ గంగూలీ మద్దతు తమకే అంటూ పోస్టర్లు తయారు చేశారు. గంగూలీ కుర్తాలో ఉంటూ నమస్కారం పెడుతున్న ఫోటో అది. ఆయా పార్టీలకు సంబంధించిన రంగులోకి గంగూలీ డ్రెస్ మారిపోవడం జరిగింది. ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతున్నట్లుగా ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దీంతో గంగూలీ మద్దతు ఏ పార్టీకి అనే డౌట్ కూడా నెటిజన్లలో మొదలైంది.
నిజ నిర్ధారణ:
సౌరవ్ గంగూలీ పొలిటికల్ పార్టీలకు మద్దతు తెలుపుతున్నట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి వాడుకుంటూ ఉన్నారు.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. గంగూలీ సైకిల్ రిథమ్ అగర్బత్తీల ప్రమోషన్ కోసం వచ్చిన ఫోటోను ఇలా పార్టీల ప్రచారానికి వాడుకుంటూ ఉన్నారు.
సౌరవ్ గంగూలీ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. 2018లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం గంగూలీ రెండేళ్ల పాటూ బెంగాల్ లో సైకిల్ ప్యూర్ అగర్బత్తీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.
సైకిల్ ప్యూర్ అగర్బత్తీలు ఫేస్ బుక్ పేజీలో వైరల్ అవుతున్న ఫోటోను 5 సంవత్సరాల కిందట అప్లోడ్ చేయడాన్ని గమనించవచ్చు. సైకిల్ రిథమ్ అగర్బత్తీల కోసం గంగూలీ నటించిన యాడ్ ను యూట్యూబ్ లో చూడొచ్చు.
గంగూలీ అగర్బత్తీల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫోటోను తీసుకుని.. మార్ఫింగ్ చేసి.. పలు పార్టీలకు మద్దతు తెలుపుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.