పూర్తిగా కరోనా టీకాలు వేయించుకున్న రోమన్ కాథలిక్ వరుడి కోసం వెతుకుతున్న మ్యాట్రిమోనియల్ ప్రకటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కోవిడ్ మహమ్మారి తరువాత జీవితాలు ఇలాగే ఉంటాయా అంటూ పలువురు నెటిజన్లు ప్రకటనను షేర్ చేస్తున్నారు.
ఈ ప్రకటనను శశి థరూర్ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇదే రాబోయే కాలంలో పెళ్లి ప్రకటనలు అంటూ ఆయన చేసిన ట్వీట్ ను కొన్ని వేల మంది లైక్ చేశారు.
నిజ నిర్ధారణ:
వ్యాక్సిన్ వేయించుకున్న వరుడే కావాలంటూ వైరల్ అవుతున్న మ్యాట్రిమోనియల్ ప్రకటనలో ఎటువంటి నిజం లేదు. ఇదొక ఫోటోషాప్ చేసిన క్లిప్పింగ్.
శశి థరూర్ ట్వీట్ కింద కామెంట్ల విభాగాన్ని చూడగా.. చాలా మంది యూజర్లు ఇదే తరహాలో ఎడిట్ చేసిన ప్రకటనలను పోస్ట్ చేశారు. ఆన్‌లైన్ టూల్ సహాయంతో వైరల్ అవుతున్న చిత్రాన్ని సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది వార్తాపత్రిక క్లిప్పింగ్ ను ఎడిట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
"Right Wing Adda" అనే ట్విట్టర్ యూజర్ ఈ ప్రకటన నకిలీదని తెలిపారు. అచ్చం అదే తరహా పేపర్ క్లిప్పింగ్ లాగా శశిథరూర్ ను ట్రోల్ చేయడం కూడా గమనించవచ్చు.
'Fodey.com' లో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తరహాలో పలు వార్తలను తయారు చేయవచ్చని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వెబ్‌సైట్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను తయారు చేస్తుంది. ఎవరైనా వినియోగదారులు వార్తాపత్రిక, తేదీ, శీర్షిక మరియు సమాచారాన్ని నమోదు చేస్తే.. ఇది వైరల్ చిత్రానికి సరిపోయే వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను సృష్టిస్తుంది. న్యూస్‌మీటర్ కూడా స్వంత క్లిప్పింగ్‌ను సృష్టించింది. పేజీ రంగు, ఫాంట్ శైలి, పరిమాణం, డేట్‌లైన్ మొదలైన వాటిలో ఉన్న సారూప్యతలను మీరు కూడా కింద గమనించవచ్చు.
ఈ వెబ్‌సైట్ టెంప్లేట్‌లోని మొదటి రెండు నిలువు వరుసలను మాత్రమే మారుస్తుంది. పాక్షికంగా కనిపించే మూడవ నిలువు వరుసలో సమాచారం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. వైరల్ ప్రకటన ఈ వెబ్‌సైట్ నుండే సృష్టించారని స్పష్టంగా తెలుస్తుంది.
వ్యాక్సిన్ వేయించుకున్న వరుడే కావాలంటూ వైరల్ అవుతున్న మ్యాట్రిమోనియల్ ప్రకటన ఇలానే ఎడిట్ చేశారు. ఆ ప్రకటనలో ఎటువంటి నిజం లేదు.