వినయ్ దామోదర్ సావర్కర్.. ఆయన్నే వీర్ సావర్కర్ అని పిలుస్తూ ఉంటారు. బ్రిటీష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఆయన. ఆయన అండమాన్ జైలులో ఉన్న సమయంలో ఓ బ్రిటీష్ రిపోర్టర్ వీడియోను చిత్రీకరించారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇది సావర్కర్ నిజ జీవిత ఫుటేజీ అని పలువురు నమ్ముతూ ఉన్నారు.
పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వచ్చారు. వీర్ సావర్కర్ నిజ జీవిత వీడియో.. దేశభక్తి ఉన్న వారందరూ తప్పకుండా చూడాలని పలువురు పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వీర్ సావర్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాకుండా హిందుత్వ వాదాన్ని ఎక్కువగా నమ్మిన వ్యక్తి అంటూ చరిత్రకారులు చెబుతూ ఉండేవారు. 1948లో మహాత్మా గాంధీ హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారంటూ అభియోగాలు మోపబడ్డాయి. సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టివేశారు.
జైలులో ఉన్న సమయంలో వీర్ సావర్కర్ ను ఎంతగానో హింసించారంటూ ఆ వీడియోలో చూపించారు.
ఈ వీడియోలో ఉన్నది నిజమైన వీర సావర్కర్ కాదని న్యూస్ మీటర్ గుర్తించింది. ఈ వీడియోకు సంబంధించిన సెర్చ్ చేయగా.. 'Ministry of Information & Broadcasting' అనే యూట్యూబ్ ఛానల్ లో ఆగష్టు 14, 2014న వీడియోను పోస్టు చేశారు. "Life of Shri Vinayak Damodar Savarkar" శ్రీ వినాయక్ దామోదర్ సావర్కర్ కు సంబంధించిన వీడియో అని అందులో ఉంది. మొత్తం వీడియో 41 నిమిషాల నిడివి ఉంది. ఆ వీడియోలో ఉన్న చిన్న క్లిప్ ను కట్ చేసి సామాజిక మాధ్యమాలో పోస్టు చేశారు.
"The film depicts various important events in his life" అంటూ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియోను ఫిలిమ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఫిలిమ్స్ డివిజన్ వెబ్సైట్ లో అందుకు సంబంధించిన సమాచారాన్ని ఉంచారు. ఈ సినిమాను వీర్ సావర్కర్ జీవిత చరిత్ర మీద తీసిందని అందులో తెలిపారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని 1983లో ప్రేమ్ వైద్య దర్శకత్వం వహించిన సినిమా ఇది.
వైరల్ అవుతున్న పోస్టుల్లో చెబుతున్నట్లుగా వీడియోలో ఉన్నది నిజమైన వీర్ సావర్కర్ కాదు. ఆయన పాత్రను ఒక నటుడు పోషించారు. 1983లో తీసిన సినిమా లోని సన్నివేశం వైరల్ అవుతోంది. బ్రిటీష్ జర్నలిస్టు తీసిన నిజమైన ఫుటేజీ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.