Fact Check : తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ ను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో..?

Man In Viral Video is not Telangana Ambulance Driver. కొందరు పోలీసులు ఓ వ్యక్తిని ఆసుపత్రి లోపలే చితక్కొడుతున్న వీడియో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2021 3:58 AM GMT
Fact Check : తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ ను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో..?

కొందరు పోలీసులు ఓ వ్యక్తిని ఆసుపత్రి లోపలే చితక్కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలిగించిన ఓ ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు చితక్కొట్టారంటూ పోస్టులు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోస్టులు పెట్టారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాను ఆపిన ఓ డ్రైవర్ ను పోలీసులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారని.. అందుకే ఇలా చితక్కొట్టారని పలువురు పోస్టులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాద్ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులు చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకున్నది కాదు.

వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మరాఠీ మీడియా సంస్థలు ఇందుకు సంబంధించిన పలు కథనాలను వెల్లడించాయి. నేషనల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురించి కథనాలను ప్రసారం చేశాయి.

ఈ వీడియోలో దెబ్బలు తింటోంది ఓ బీజేపీ కార్యకర్త అని మీడియా కథనాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మహారాష్ట్ర లోని జల్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దివ్య మరాఠీ మీడియా సంస్థ కథనం ప్రకారం ఈ ఘటన జల్నా లోని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 9, 2021న ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ లోకల్ లీడర్ అయిన శివరాజ్ నారియల్వాలేను పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. శివరాజ్ నారియల్వాలే జల్నా జిల్లాలో బీజేపీ యువ మోర్చా జనరల్ సెక్రెటరీగా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యువకుడు చికిత్స తీసుకుంటూ ప్రాణాలను కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ యువకుడు చనిపోయాడని బంధువులు ఆరోపించారు. శివరాజ్ మరికొంత మంది కలిసి.. ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఆసుపత్రి సిబ్బందితో చనిపోయిన యువకుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జల్నా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుధీర్ ఖిరాద్కర్, ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మహాజన్ మరికొందరు సిబ్బందితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులను శాంతిపజేయడానికి ప్రయత్నించగా వాళ్ళు వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు.

https://www.freepressjournal.in/mumbai/probe-ordered-after-video-of-cops-thrashing-bjp-worker-in-maharashtras-jalna-goes-vira

ఇంతలో బీజేపీ నేత శివరాజ్ తన మొబైల్ ఫోన్ ను తీసి రికార్డు చేయడం మొదలు పెట్టాడు. దీంతో పోలీసుల దృష్టి శివరాజ్ మీద పడింది. వీడియో రికార్డు చేస్తున్న శివరాజ్ ను పోలీసులు ఆసుపత్రి లోనికి తీసుకుని వెళ్లారు. అక్కడే అతడిని బెల్ట్ తోనూ, కట్టెలతోనూ, రాడ్లతోనూ కొట్టడం మొదలు పెట్టారు. ఇష్టమొచ్చినట్లుగా పోలీసులు అతడిని బాదారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేశారు. ఏప్రిల్ నెలలో ఈ ఘటన అయినప్పటికీ పోలీసుల భయంతోనూ, బెదిరింపుల కారణంగా శివరాజ్ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇటీవలే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుధీర్ ఖిరాద్కర్ లంచం ఆరోపణలతో సస్పెండ్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో శివరాజ్ కు ధైర్యం వచ్చింది.తెచ్చుకుని ఈ వీడియోను మీడియాకు ఇచ్చాడు.

https://news.abplive.com/news/video-goes-viral-showing-cops-thrashing-bjp-worker-in-maha-s-jalna-probe-ordered-after-political-outrage-1460567

దివ్య మరాఠీ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది తానేనని చెప్పుకున్నాడు. ఏప్రిల్ 9, 2021న నన్ను పోలీసులు ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని వెల్లడించాడు. అందరూ కలిసి నన్ను కొడుతూ ఉంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయానని శివరాజ్ బాధపడుతూ చెప్పాడు. ఈ విషయాన్ని పలువురు బీజేపీ నేతలు ఖండిస్తూ వీడియోను ట్వీట్ చేశారు.

తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ ను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.




Claim Review:తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ ను చితక్కొట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter, Facebook
Claim Fact Check:False
Next Story