కొద్దిరోజుల కిందట నగరంలోని ప్రముఖ సికింద్రాబాద్ గణపతి ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడిపై అక్కడి ఓ పూజారి దాడి చేశారు. గణపతి ఆలయానికి వచ్చిన ఉప్పల్‌కు చెందిన భక్తుడు వినాయకుడిని దర్శించుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన పూజారి ఏకంగా ఆ భక్తుడిపై దాడి చేశాడు.
అయితే ఈ వీడియోకు సంబంధించి.. "పూజారి దగ్గరకు వెళ్లి యేసును నమ్ముకో పరలోకం పోతావు" అని చెప్పడంతో దాడి జరిగిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను పక్కదోవ పట్టించేది.
న్యూస్‌మీటర్ వీడియో స్క్రీన్‌షాట్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. ఇలాంటి దృశ్యాలతో కూడిన వీడియోను 'ఈటీవీ తెలంగాణ' మార్చి 6, 2022న ప్రచురించిందని మేము కనుగొన్నాము. వీడియోలో, సికింద్రాబాద్‌లోని గణపతి ఆలయానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడి చేస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన ఓ భక్తుడితో ఆలయ పూజారి ప్రభాకర్‌శర్మ వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకుండా ఆయన ప్రవేశంపై పూజారి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇది ప్రారంభమైందని మీడియా సంస్థ తెలిపింది.
సికింద్రాబాద్ లోని గణపతి ఆలయానికి వచ్చాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడే ఉన్న ఉప ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేశాడు. అయితే, పూజారి ప్రభాకర్ శర్మ అందుకు అడ్డుచెప్పాడు. అనుమతి లేకుండా ఎలా వెళతావంటూ ఆ భక్తుడిపై ప్రభాకర్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ భక్తుడిపై దాడి చేయగా, ఈ భక్తుడు కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన విజువల్స్ గణపతి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. ఈ ఘటనపై సదరు భక్తుడు పూజారి ప్రభాకర్ శర్మపై ఆలయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆలయ అధికారులు స్పందించారు. పూజారి ప్రవర్తనపై దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిస్తామని, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈటీవీ భారత్, ఎన్టీవీ తెలుగు, ఏబీఎన్ తెలుగు వంటి పలు వార్తా సంస్థలు ఈ ఘటనకు సంబంధించిన కథనాలను అలాగే వీడియోలను ప్రచురించాయి. ఈ దాడిపై భక్తుడు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భక్తుడి పేరును వాల్మీకిరావుగా పేర్కొన్నారు. పోలీసులు పూజారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. FIR అందుబాటులోకి వచ్చిన వెంటనే మేము ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాము.
కాబట్టి వైరల్ పోస్టు ప్రజలను తప్పుదారి పట్టించేది.