ఉత్తరప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రెటరీ అవనీష్ అవస్థి రాష్ట్రంలో లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇస్తున్నారంటూ చెప్పిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.
ఆ వీడియోలో అవనీష్ అవస్థి మాట్లాడుతో రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రార్థనా మందిరాలను జూన్ 8 నుండి తెరవబోతున్నామని అన్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లవచ్చని.. అయితే సామాజిక దూరం తప్పకుండా పాటించాలని ఆయన కోరారు. వచ్చే జూన్ 8 నుండి ఈ నిబంధనలు ఉత్తరప్రదేశ్ లో అమలులోకి వస్తాయని భావించిన ప్రజలు షేర్లు చేయడం మొదలు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంచుతూ ఉన్నారు. వీడియో పైన మే 31 అంటూ డేట్ ఉన్నప్పటికీ.. ఇది ఇప్పటి వీడియో కాదని న్యూస్ మీటర్ తెలుసుకుంది. వీడియోలో ఉన్న బ్యాగ్రౌండ్ కు, ప్రస్తుతం ఏబీపీ ఛానల్ బ్యాగ్రౌండ్ కు చాలా వ్యత్యాసం ఉంది. ఈ మధ్య ఏబీపీ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోలను ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలను గమనించగా అది స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోను 11 నెలల కిందట అప్లోడ్ చేశారు. అంటే గత ఏడాది లాక్ డౌన్ సమయంలో అప్లోడ్ చేసిన వీడియో అని స్పష్టమవుతోంది. ఆ వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ప్రస్తుతం ఉన్న మీడియా రిపోర్టుల ప్రకారం ఇప్పట్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసేలా కనిపించడం లేదు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా రాలేదు. ఉత్తరప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో కంటోన్మెంట్ జోన్ లను ఏర్పాటు చేశారు.
మే 31న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సడలింపులను ఇచ్చింది తప్పితే షాపింగ్ మాల్స్ ను తెరవమంటూ ఉత్తర్వులను ఇవ్వలేదు. 55 జిల్లాల్లో లాక్ డౌన్ సడలింపులను అమలు చేస్తూ ఉండగా.. ఇంకా 20 జిల్లాల్లో కరోనా కేసులు ఆందోళనకరంగా ఉండడంతో అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉన్నారు. 600 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాల్లో కాస్త సడలింపులను ఇచ్చారు. కంటోన్మెంట్ జోన్ల అవతల షాపులను, మార్కెట్లను తెరచుకోవచ్చని అన్నారు. అంతే తప్పితే జూన్ 8 నుండి షాపింగ్ మాల్స్ ను తెరచుకోవచ్చు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఉత్తరప్రదేశ్ లో జూన్ 8 నుండి మాల్స్, రెస్టారెంట్లు తెరవబోతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో కొన్ని నెలల కిందటిది.