ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగగా.. ఆ సమయంలో పారిస్ లో కొన్ని సింహాలు వీధుల్లోకి వచ్చాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఫ్రాన్స్ కు సంబంధించిన దృశ్యాలని పేర్కొంటూ అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు.. రోడ్డుపై కార్ల పక్కన వెళుతున్న సింహాల గుంపుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేదనే ఆరోపణతో అల్జీరియన్ సంతతికి చెందిన నహెల్ అనే బాలుడిని ఫ్రెంచ్ పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఇలాంటి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ప్యారిస్ నగర దుస్థితిని తెలుపుతూ సింహాల బృందానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియో పాతది.. ఫ్రాన్స్ లో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించినది కాదని న్యూస్‌మీటర్ బృందం ధృవీకరించింది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా.. మేము అదే వీడియోను యూట్యూబ్‌లో ఫ్రాన్స్ లో అల్లర్లు జరగకముందే అప్లోడ్ చేశారని గుర్తించాం. 22, అక్టోబర్ 2020 తేదీన వీడియోను అప్లోడ్ చేశారు. "a pretty nerve-racking experience sitting in a car as the lion pride made the way through us. Knowsley Safari Park" అంటూ డిస్క్రిప్షన్ లో ఇచ్చారు. కనోజ్లీ సఫారీ పార్క్ లో చోటు చేసుకున్న ఘటన అని తెలిపారు.
యూట్యూబ్ షార్ట్స్ లో కూడా ఇలాంటి వీడియోను మేము కనుగొన్నాం.
మేము మరింత సెర్చ్ చేయగా.. ఒక సంవత్సరం క్రితం Pinterestలో అప్‌లోడ్ చేసిన అదే వీడియోను కూడా మేము కనుగొన్నాము.
వీడియోకు ఫ్రాన్స్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నాం. ముఖ్యంగా 2020లో చిత్రీకరించారని తెలుసుకున్నాం.
దీని నుండి క్యూ తీసుకొని, వెబ్‌లో సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. నోస్లీ సఫారి పార్క్ ఇంగ్లాండ్‌లోని ప్రెస్‌కాట్ సమీపంలో ఉన్న సఫారీ పార్క్. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని మేము కనుగొన్నాము.
అందువల్ల, ఈ వీడియోకు ఫ్రాన్స్ లో అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదు.