Fact Check : తిరుమలలో శిలువ కలకలం.. నిజమెంత..?

Lighting at Tirumala temple represents Purna Kumbham. వైకుంఠ ఏకాదశి కారణంగా ఎన్నో దేవాలయాలను దేదీప్యమానంగా అలంకరించారు.

By Medi Samrat  Published on  29 Dec 2020 10:32 AM GMT
Fact Check : తిరుమలలో శిలువ కలకలం.. నిజమెంత..?

వైకుంఠ ఏకాదశి కారణంగా ఎన్నో దేవాలయాలను దేదీప్యమానంగా అలంకరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పూలతోనూ, లైట్లతోనూ అలంకరించారు.

తిరుమలలో చేసిన లైట్ సెట్టింగ్ లో శిలువను ఉంచారని.. అన్యమత ప్రార్థనలకు నిషేధం ఉన్నా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

తిరు నామాలకు ఇరువైపులా ఉండవలసిన శంఖు చక్రాలు లేకుండా పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల ఆలయ ప్రాంగణంలో శిలువ గుర్తుతో డెకరేషన్ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలశాయి. కావాలనే శిలువ ఆకారంలో అలా డెకరేషన్ చేశారంటూ తెలిపారు.







నిజ నిర్ధారణ:

తిరుమల ఆలయంపై క్రైస్తవుల శిలువ గుర్తు ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వైరల్ అవుతున్న పోస్టులు నిజమా కాదా అని తెలుసుకోడానికి తిరుమలలో ఏర్పాటు చేసిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వీడియోలను పరిశీలించగా అవి శిలువ కాదని తెలిసింది.


ఆ డెకరేషన్ చేసినది 'పూర్ణ కుంభం' అని స్పష్టంగా తెలుస్తోంది. హిందూ సాంప్రదాయంలో పూర్ణకుంభానికి ఎంతో ప్రత్యేకత ఉంది.





ఈ దుష్ప్రచారాన్ని టీటీడీ కూడా సీరియస్ గా తీసుకుంది. తిరుమలలో శిలువ అంటూ ప్రచారం చేసిన వారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.





తిరుమల ఆలయంపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని.. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న కృషి భక్తులందరికీ తెలుసన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాకారంపై పూర్ణ కలశ ఆకారంలో ఉన్న విద్యుత్ అలంకరణను శిలువగా మార్ఫింగ్ చేసి 'తాళ పత్ర నిధి' అనే Facebook పేజీతో పాటు మరికొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాయని ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. శ్రీవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హనుమంత, గరుడ, పూర్ణకుంభ అలంకరణలు చేయడం కొన్ని దశాబ్దాలుగా వస్తోందని.. పవిత్రమైన కళశంను శిలువగా మార్ఫింగ్ చేసి కుట్ర పూరితంగా దుష్ప్రచారం చేశారని అన్నారు. ఈ పోస్ట్ పెట్టిన తాళ పత్ర నిధి Facebook URL, ఇతరులపై పోలీసు కేసు నమోదు చేసినట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల క్షేత్రంపై తరచూ కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వారిపై టీటీడీ చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.



ఇలాంటి వదంతులను నమ్మకండని కొందరు భక్తులు కూడా వీడియోలను పోస్టు చేశారు. వదంతులను వ్యాపించే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.



https://tv9telugu.com/tdd-serious-on-fake-campaign-on-lord-balaji-temple-376776.html

లోకల్ రిపోర్టర్ కూడా అక్కడికి చేరుకుని శిలువ కాదని.. పూర్ణకుంభం అంటూ క్లారిటీ ఇచ్చారు.

తిరుమల కొండపై శిలువ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. అక్కడ ఉన్నది పూర్ణకుంభం.


Next Story