వరిధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్న చిత్రం వాట్సాప్‌లో షేర్ అవుతోంది.
చిత్రంలో జీవన్‌రెడ్డి 'కేసీఆర్ ఈ దొంగ ధర్నాలు ఆపి వడ్లు కొను' అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్నారు. టీఆర్ఎస్ నేత అయి ఉండి.. తమ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఇలా చేయడం ఏమిటని మీకు అనిపించవచ్చు. అది కూడా గులాబీ కండువా వేసుకొని ఆయన కనిపించారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకోలేదు.
11 ఏప్రిల్ 2022న Facebookలో జీవన్ రెడ్డి షేర్ చేసిన అసలైన చిత్రాన్ని NewsMeter బృందం కనుగొంది. ఆ ప్లకార్డ్‌లో " రైతుల జీవితాలతో రాజకీయమా? సిగ్గు సిగ్గు" అని రాసి ఉంది. అంతేకానీ "కేసీఆర్ ఈ దొంగ ధర్నాలు ఆపి వడ్లు కొను" అని లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి రైతుల కోసం ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నాకు జీవన్‌రెడ్డి హాజరయ్యారు. దేశవ్యాప్త మద్దతు కోసం ఢిల్లీలో టీఆర్‌ఎస్ ధర్నాకు దిగింది. ధర్నా నిర్వహించిన తెలంగాణ భవన్ పరిసర వీధులన్నీ ఫ్లెక్స్ బోర్డులు, గులాబీ జెండాలతో నిండిపోయాయి. పలు హోర్డింగ్‌లు పెట్టారు. ఆహారధాన్యాల సేకరణకు ఏకరూప జాతీయ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్ ఎంపీలు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ కేబినెట్ మొత్తం హాజరయ్యారు.
కాబట్టి వైరల్ ఫోటోను ఎడిట్ చేశారని గుర్తించాం. అలాగే ఏమైనా జీవన్ రెడ్డి కేసీఆర్ పై తిరుగుబాటు చేశారా..? అనే విషయం గురించి వార్తలను వెతికాం.. కానీ ఎక్కడ కూడా అందుకు సంబంధించిన రిజల్ట్స్ కనిపించలేదు.
మరో వైపు కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆయన పలు విషయాలలో అధికార టీఆర్ఎస్ పై కన్నెర్ర జేస్తూ వస్తున్నారు.
కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.