FIFA వరల్డ్ కప్ 2022లో కోస్టారికాతో 1-0 తేడాతో ఓడిన తర్వాత జపాన్ డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని చెత్తతో నింపారని.. సోషల్ మీడియా యూజర్లు చెత్తగా ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌ల ఫోటోలను షేర్ చేస్తున్నారు.
చాలా మంది ఫేస్‌బుక్ వినియోగదారులు "కోస్టారికా మ్యాచ్ తర్వాత జపాన్ డ్రెస్సింగ్ రూమ్" అనే క్యాప్షన్‌తో ఫోటోలను పంచుకున్నారు. "Japan's dressing room after Costa Rica match."
నవంబర్ 23న FIFA వరల్డ్ కప్‌లో జపాన్ 2-1తో జర్మనీని ఓడించిన తర్వాత ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంను శుభ్రం చేసినందుకు జపనీస్ అభిమానులు ప్రశంసలను అందుకున్నారు. అందుకే ఈ వాదన ఆశ్చర్యకరంగా ఉంది.
జర్మనీతో మ్యాచ్ తర్వాత వారి డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి చెత్త కనిపించలేదని.. జపాన్ జట్టును FIFA కూడా అభినందించింది.
నిజ నిర్ధారణ :
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. 27 మార్చి 2022న ది పోస్ట్ ఇంటర్నేషనల్ ప్రచురించిన కథనంలో అదే ఫోటోలను కనుగొంది. ఇటలీ నార్త్ మాసిడోనియాతో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటలీ FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించడంలో విఫలమైందని మీడియా సంస్థ నివేదించింది. ఇటాలియన్ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఇటలీలోని పలెర్మోలోని స్టేడియో రెంజో డ్రెస్సింగ్ రూమ్ ను ఇలా చేశారని పలువురు నివేదించారు.
అనేక ఇటాలియన్ వెబ్‌సైట్‌లలో కూడా వైరల్ ఫోటోలను మేము కనుగొన్నాము. నార్త్ మాసిడోనియాపై ఓడిపోయిన తర్వాత ఇటాలియన్ జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఫోటోలలో కనిపించే విధంగా డ్రెసింగ్ రూమ్ లో గందరగోళాన్ని చేశారని వారు నివేదించారు.
డైలీ మెయిల్ ప్రకారం, ఇటలీ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ లియోనార్డో బోనుచి తన జట్టు తరపున క్షమాపణలు చెప్పాడు. అతను మాట్లాడుతూ "ఇది చాలా పెద్ద తప్పు, మేము చాలా నిరాశకు గురయ్యాము.. ఈ పనికి క్షమాపణలు చెబుతున్నాం.. మరోసారి ఇలాంటి పనిని తాము చేయము" అని అన్నాడు.
డైలీ మెయిల్ నివేదికలో జపాన్ మద్దతుదారులు కోస్టా రికాతో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ స్టేడియంను శుభ్రం చేయడానికి ఆఖరి వరకూ ఉన్నారు. ఖతార్‌లోని దోహాలోని అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో జపాన్, కోస్టారికా మధ్య జరిగిన గ్రూప్ E మ్యాచ్ తర్వాత జపాన్ అభిమానులు, జట్టు సభ్యుడు స్టాండ్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లో చెత్తను తొలగిస్తున్నట్లు అనేక ఫోటోలను కూడా మేము కనుగొన్నాము.
FIFA వరల్డ్ కప్ 2022లో కోస్టారికాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత జపాన్ ఫుట్‌బాల్ డ్రెస్సింగ్ రూమ్‌ను చెత్తతో నింపేయలేదు. వైరల్ ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది.