బీచ్‌పై మేఘాలు కమ్ముకుంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం బీచ్‌కి చెందినదని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇది అసని తుఫాను సమయంలో చోటు చేసుకుందని పలువురు చెబుతున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ సయ్యద్ అక్బర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. "#AsaniCyclone #Asani #cyclone Scene at #Machilipatnam beach. Very fearsome and scary. Power of Nature #Andhrapradesh. (sic)" అంటూ వైరల్ వీడియోను పోస్టు చేశారు. మేఘాలు మరీ కిందకు వచ్చినట్లుగా వీడియోలో మనం చూడవచ్చు.
ఇదే క్లెయిమ్ ను పలువురు ఇతర ట్విట్టర్ వినియోగదారులు కూడా షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం 'Andhra Pradesh Weatherman' నుండి ఒక ట్వీట్ ను మే 11న కనుగొంది. వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్‌కు ఆయన రిప్లై ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు, ఆ స్క్రీన్ షాట్ అదే విజువల్స్ ను కలిగి ఉంది. వైరల్ వీడియో అసని తుఫానుకు సంబంధించినది కాదని చెప్పారు. ఇది జూన్ 2021లో శ్రీకాకుళంలోని కళింగపట్నంలో తీయబడిందని వివరణ ఇచ్చారు.
మేము ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను తనిఖీ చేసాము.. జూన్ 2021 నాటి వీడియోని కనుగొన్నాము. "Kalingapatnam beach, Srikakulam."(కళింగపట్నం బీచ్, శ్రీకాకుళం) అంటూ పోస్టు పెట్టడం గమనించవచ్చు.
'ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్' అనే అకౌంట్ ను సాయి ప్రణీత్ అనే యువకుడు వాడుతూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన వెదర్ అప్డేట్స్ ను క్రమం తప్పకుండా ఇస్తారు.
మేము వీడియో లొకేషన్‌ను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, వైరల్ వీడియో అసని తుఫానుకు సంబంధించినది కాదని స్పష్టమైంది.