FactCheck : పాకిస్తాన్ కూల్చివేసిన రాఫెల్ జెట్ నుండి పైలట్ శివంగి సింగ్ బయటకు దూకేశారా?

భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 13 May 2025 9:12 PM IST

FactCheck : పాకిస్తాన్ కూల్చివేసిన రాఫెల్ జెట్ నుండి పైలట్ శివంగి సింగ్ బయటకు దూకేశారా?

భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాఫెల్ జెట్‌లను కూల్చివేసి, రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపిన మొదటి భారతీయ మహిళ లెఫ్టినెంట్ శివాంగి సింగ్‌ను పట్టుకున్నట్లు అనేక పాకిస్తానీ ఖాతాలు తప్పుడు వాదనలను షేర్ చేశాయి.

విస్తృతంగా ప్రచారం చేసిన ఒక వీడియోలో, పాకిస్తాన్ కూల్చివేసినట్లు చెబుతున్న రాఫెల్ జెట్ నుండి బయటకు వచ్చిన శివాంగి సింగ్ విద్యుత్ లైన్లలో చిక్కుకున్న వ్యక్తిని చూపించారు. అయితే, ఈ వీడియో వాస్తవానికి మార్చి 2025లో హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో విద్యుత్ లైన్లలో ఇరుక్కుపోయిన పారాగ్లైడర్‌ను చూపిస్తుందని న్యూస్‌మీటర్ కనుగొంది. ఆ వ్యక్తిని సురక్షితంగా రక్షించారు.

ఇలాంటి వాదనలతోనే ఒక చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఇది పాకిస్తాన్‌లో శివాంగి సింగ్ తన రాఫెల్ జెట్‌ను కూల్చివేసిన తర్వాత విడుదల చేసిన మొదటి చిత్రం అని పేర్కొంటూ ఒక మహిళా పైలట్ నేలపై పడి ఉన్న ఫోటోను చూడొచ్చు. పాకిస్తాన్‌లో శివాంగి సింగ్ రాఫెల్ జెట్‌ను కూల్చివేసిన తర్వాత విడుదల చేసిన మొదటి చిత్రం అని ఉంది.

ఒక X యూజర్ “పాకిస్తాన్‌లో కాల్చివేసిన భారతీయ మహిళా శివానీ సింగ్ రాఫెల్ పైలట్ చిత్రం విడుదలైంది. #OperationBunyanulMarsoos #PakistanArmy” అంటూ రాశారు.


మరో పోస్ట్‌లో "పాకిస్తాన్ సైన్యం వింగ్ కమాండర్ శివాంగి సింగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత ఆమెను అరెస్టు చేసింది. యుద్ధ ఖైదీగా ఆమెకు పూర్తి గౌరవం ఇవ్వాలి. పాకిస్తాన్‌కు స్వాగతం, దీదీ." అని ఉంది.

నిజ నిర్ధారణ:

NewsMeter వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ చిత్రం 2023 నాటిది. కర్ణాటకలో కూలిపోయిన శిక్షణా విమానం నుండి బయటకు వచ్చిన పైలట్‌ను చూపిస్తుంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూన్ 1, 2023న ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఫోటో ఎడిట్ చేయని వెర్షన్‌ మాకు లభించింది. శీర్షిక ప్రకారం, ఈ చిత్రం కర్ణాటకలోని చామరాజనగర్‌లోని భోగాపుర గ్రామం సమీపంలో కూలిపోయే ముందు కిరణ్ జెట్ ట్రైనర్ విమానం నుండి బయటకు వచ్చిన ఇద్దరు IAF పైలట్‌లను చూపిస్తుంది.

సాధారణ శిక్షణ కోసం బెంగళూరు నుండి బయలుదేరిన విమానం, కూలిపోయింది. పైలట్లకు ఈ ప్రమాదంలో ఏమవ్వలేదు.


ఈ చిత్రం జూన్ 1, 2023 నాటి "చామరాజనగర్‌లో ట్రైనర్ జెట్ క్రాష్‌లు" అనే శీర్షికతో స్టార్ ఆఫ్ మైసూర్‌లో వచ్చిన కథనంలో కూడా కనిపించింది. ఆ కథనం పైలట్‌లను గుర్తించింది. ప్రత్యక్ష సాక్షి భోగాపుర మహేష్‌ ప్రమాదం గురించి మాట్లాడారు. "మేము ఆకాశంలో పెద్ద శబ్దం విన్నాము. విమానం నేలపైకి కూలిపోవడాన్ని చూశాము. ఇద్దరు పైలట్లు పారాచూట్‌లతో బయటకు వస్తున్నట్లు కూడా చూశాము. మేము సంఘటనా స్థలానికి చేరుకోగా విమానం అప్పటికే కాలిపోతున్నట్లు చూశాము, కానీ అక్కడ ఎవరూ లేరు. తరువాత, పైలట్లు మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నారని మేము కనుగొన్నాము. అప్పుడు నా స్నేహితుడు చంద్రు, నేను పోలీసులకు, ప్రెస్‌కు కాల్ చేసాము." అని వివరించారు.


ఈ సంఘటనను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2, 2023న నివేదించింది. జూన్ 1న తన అధికారిక X హ్యాండిల్‌లోని పోస్ట్‌లో IAF ఈ ప్రమాద విషయాన్ని ధృవీకరించింది. “ఈరోజు కర్ణాటకలోని చామరాజ్‌నగర్ సమీపంలో IAFకి చెందిన కిరణ్ శిక్షణ విమానం సాధారణ శిక్షణా కార్యక్రమంలో ఉండగా కూలిపోయింది. విమానంలోని ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాన్ని నిర్ధారించేందుకు కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు." అని అందులో ఉంది.

PIB వివరణ

మే 10న, అధికారిక PIB ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ కూడా పాకిస్తాన్‌లో శివాంగి సింగ్ పట్టుబడ్డారని వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవమని స్పష్టం చేసింది.



ముగింపు

వైరల్ చిత్రంలో ఉన్నది శివంగి సింగ్ కాదు. ఇది 2023 నాటి పాత ఫోటో, కర్ణాటకలో శిక్షణా విమాన ప్రమాదం తర్వాత తీసిన చిత్రాలు.

ఈ చిత్రాన్ని రాఫెల్ ప్రమాదం లేదా పాకిస్తాన్ చర్యలతో అనుసంధానించే వాదనల్లో ఎలాంటి నిజం లేదు.

Credits : Md Mahfooz Alam

Claim Review:పాకిస్తాన్ కూల్చివేసిన రాఫెల్ జెట్ నుండి పైలట్ శివంగి సింగ్ బయటకు దూకేశారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story