పీపీఈ కిట్లతో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లు శవాలను మున్సిపాలిటీ చెత్త ట్రక్కుల్లో తరలిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. చనిపోయిన వారిని కనీసం అంబులెన్స్ లో తరలించకుండా ఇలా చెత్త వాహనాల్లో తరలించడం ఏమిటని పెద్ద ఎత్తున ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుందని పోస్టులు పెట్టారు.
చెత్త వాహనంలో పోలీసులు శవాలను విసిరివేస్తూ ఉన్నారని.. యోగి రాజ్యంలో ఇలాంటి దారుణాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయని పలువురు పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ ఘటన ఛత్తీస్ఘర్ రాష్ట్రంలోని రాజనందగావ్ లో చోటు చేసుకుందని న్యూస్ మీటర్ గుర్తించింది. Free Press Journal, NDTV, The Wire మీడియా సంస్థల కథనాల ప్రకారం రాజనందగావ్ లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను చెత్త వాహనంలో తరలించారని తెలుస్తోంది. ఇలా చెత్త వాహనాన్ని ఎందుకు వాడుతున్నారనే ప్రశ్నను మెడికల్ ఆఫీసర్ ను అడగ్గా.. వాహనాలను అందుబాటులో ఉంచడం నగర పంచాయతీ, ముఖ్యమంత్రి ఆఫీసు చేతుల్లో ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
ఛత్తీస్ఘర్ రాష్ట్రంలో అంబులెన్స్ ల కొరత ఉందని.. అందుకే చెత్త వాహనాలను మృతదేహాలను తరలించడానికి ఉపయోగిస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఒక్కో సారి ఎనిమిది కంటే ఎక్కువ మృతదేహాలను ఈ చెత్త వాహనాల్లో శ్మశానవాటికకు తరలించారని తెలుస్తోంది. బీజేపీ నేత కేడర్ కశ్యప్ ఏప్రిల్ నెలలోనే ఇది ఛత్తీస్ఘర్ రాష్ట్రంలో చోటు చేసుకుందని ట్వీట్ చేశారు.
Economic Times లో కూడా ఈ ఘటనకు సంబంధించిన వార్త వచ్చింది. రాజనందగావ్ జిల్లాలోని డాన్గార్గావ్ బ్లాక్ లో ఏప్రిల్ 14న మృతదేహాలను ఇలా తరలించారని తెలిపారు. రాజనందగావ్ లో మృతదేహాలను చెత్త వాహనాలలోనే తరలిస్తూ ఉన్నారని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెత్త ట్రక్కులో మృతదేహాలను తరలిస్తూ ఉన్నారని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన ఛత్తీస్ఘర్ రాష్ట్రంలోని రాజనందగావ్ గ్రామంలో చోటు చేసుకుంది.